కోటి ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగు నీరు అని ప్రచారం.. రియాల్టీలో సీన్ రివర్స్

by Disha Web Desk 4 |
కోటి ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగు నీరు అని ప్రచారం.. రియాల్టీలో సీన్ రివర్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సాగునీటి అవసరాలకు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం సర్వరోగ నివారణిగా ప్రొజెక్ట్ చేస్తున్నది. దీనికోసం కార్పొరేషన్ పేరుతో రూ. 97 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకున్నది. ఇందులో దాదాపు రూ. 87 వేల కోట్లను ఖర్చు చేసింది. ఇంత చేసినా గోదావరి నుంచి ఎత్తిపోసిన నీరంతా వర్షాకాలంలో తిరిగి సముద్రంలోకే వెళ్లిపోయింది. నికరంగా ఈ ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు కూడా నేరుగా కాల్వల ద్వారా నీరు పారలేదు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న సుమారు పాతిక లక్షల వ్యవసాయ పంపు సెట్లకు తోడు మరికొన్ని కొత్తగా పుట్టుకొచ్చాయి.

ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు అంటూ సర్కారు చెప్పుకుంటున్నా గతేడాది కురిసిన వర్షాలకు అన్నారం, కన్నేపల్లి పంప్‌హౌజ్‌లు వరద నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికీ అవి పూర్తిస్థాయిలో ఫంక్షనింగ్‌లోకి రాలేదు. కాళేశ్వరం సహా రాష్ట్రంలోని మొత్తం సాగునీటిపారుదల రంగానికి ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో సుమారు లక్షన్నర కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. ఇందులో సింహభాగం కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే ఖర్చయింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున సాగునీరు అందిస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ తొమ్మిదేళ్లు పూర్తియిన తర్వాత కూడా ఆ లక్ష్యం నెరవేరలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్తగా 18.25 లక్షల ఎకరాలను సాగులోకి తేవడంతో పాటు మరో 18.82 లక్షల ఎకరాలను స్థిరీకరించనున్నట్లు ప్రభుత్వం చెప్పింది. కానీ తొమ్మిదేళ్ల తర్వాత కూడా కేవలం 17.23 లక్షల ఎకరాలు మాత్రమే సాగునీటిపారుదల విస్తీర్ణం పెరిగినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నా అది ఇంకా చేరుకునే దశలోనే ఉన్నది.

దక్షిణాది మాటేమిటి?

ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేశామంటూ ప్రభుత్వం చెప్పుకుంటున్నా దక్షిణ తెలంగాణపై మాత్రం వివక్ష కొనసాగుతున్నది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కరువుకు చిరునామాగా ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కోసం ఉమ్మడి రాష్ట్రంలోనే తెరమీదకు వచ్చిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాలేదు. దగ్గరుండి దాన్ని పూర్తిచేస్తామని పలుమార్లు కేసీఆర్ చెప్పినా ఇప్పటికీ అది పెండింగ్‌లోనే పడిపోయింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చయింది. కానీ ఫలాలు ఇంకా అందలేదు. దీనితో పాటు సంగమేశ్వర- బసవేశ్వర ప్రాజెక్టు, ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు సైతం అసంపూర్ణంగానే ఉండిపోయాయి.

కలిసొచ్చిన వర్షపాతం

మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించడం, పూడికతీత పనులతో సాగునీటి వ్యవస్థ ఒక మేరకు గాడిన పడింది. తొమ్మిదేళ్ళ కాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం కలిసొచ్చింది. చెరువుల్లో నీరు నిల్వ ఉండడంతో పాటు భూగర్భ జలమట్టం పెరిగింది. రైతులకు ఇది ఒక మేరకు ఉపశమనం. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు సుమారు 74.32 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యాన్ని కల్పించగలిగామని, రానున్న మూడేళ్ళలో మరో 51 లక్షల ఎకరాలకు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

కాళేశ్వరం అప్పులు ఓ సవాలు

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులను 40 ఏండ్ల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం తీర్చాల్సి ఉన్నది. ఇదంతా బడ్జెటేతర (ఆఫ్ బడ్జెట్) రూపంలో కార్పొరేషన్ పేరు మీద ప్రభుత్వ గ్యారెంటీతో పవన్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ తదితర సంస్థల నుంచి సమకూర్చుకున్నది. ఈ రుణాల చెల్లింపు కోసం ఏటా సుమారు రూ. 13 వేల కోట్ల చొప్పున వెచ్చించాల్సి ఉంటుంది. రెండేండ్ల క్రితం రీ పేమెంట్ ప్రక్రియ మొదలైంది.

గతేడాది జూన్ నాటికి కేవలం రూ. 79 కోట్లు మాత్రమే చెల్లించింది. 2019 నుంచి 2022 జూన్ వరకు వడ్డీల కోసం రూ. 6,401 కోట్లను చెల్లించింది. బ్యాంకులు, సంస్థల నుంచి తీసుకున్న కొన్ని రుణాలను నెలవారీగా మొత్తం 180, 144 ఇన్‌స్టాల్‌మెంట్లలో, మరికొన్నింటిని క్వార్టర్లీగా 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉన్నది. గరిష్టంగా 15 సంవత్సరాల్లోగా ‘అసలు’ను తీర్చేయాల్సి ఉన్నందున దాదాపు 2037 సంవత్సరం వరకు వడ్డీలు కూడా కట్టక తప్పదు. మొత్తం తీసుకున్న అప్పు రూ. 97 వేల కోట్లు అయితే వడ్డీ రూపంలో అదనంగా రూ. 72 వేల కోట్లను చెల్లించక తప్పదు. దీంతో మొత్తం రుణభారం రాష్ట్ర ఖజానాపై కాళేశ్వరం పేరుతో రూ. 1.69 లక్షల కోట్లకు చేరినట్లయింది.

తెగని కృష్ణా జలాల వాటా పంచాయితీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జలాల విషయంలో ఎదుర్కొన్న సమస్యలే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. కృష్ణా జలాల వాటాపై తొమ్మిదేళ్ల తర్వాత కూడా పరిష్కారం దొరకలేదు. ఢిల్లీలోని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లోనూ వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఫిఫ్టీ ఫిప్టీ (రెండు రాష్ట్రాలకూ 50% వాటా చొప్పున) డిమాండ్‌ను తెరపైకి తెస్తున్న తెలంగాణ తనకు దక్కిన వాటాను ఎందుకు సమర్ధవంతంగా వినియోగించుకోలేపోతున్నదనే ప్రశ్నలకు సమాధానం కరువైంది.


Next Story

Most Viewed