- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడిగడ్డ కంటే ముందే ‘అన్నారం, సుందిళ్ల’.. బ్యారేజీల రిపేర్లపై ప్రభుత్వం సీరియస్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించింది. అయితే.. లక్ష కోట్లకు పైగానే ఖర్చు చేసి ప్రాజెక్టు నిర్మించినా.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ ప్రాజెక్టులోని లోపాలు ఒక్కసారిగా వెలుగుచూశాయి. మేడిగడ్డకు సంబంధించి రెండు పియర్లు కుంగుబాటుకు గురయ్యాయి. దాంతో వెంటనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా.. కేంద్రంలోని ఎన్‌డీఎస్ఏకు వెంటనే ఫిర్యాదు చేసింది. దాంతో ఎన్‌డీఎస్ఏ రంగంలోకి దిగింది. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయని.. డిజైన్లలోనూ భారీ స్థాయిలో లోపాలు ఉన్నాయని వెల్లడించింది. ఇక 2023 నుంచి ఆ ప్రాజెక్టు వృథాగానే మిగిలిపోయింది. అయితే.. ఆ మూడు బ్యారేజీలకు రిపేర్లు చేయించేందుకు ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణ సంస్థలోనే పునర్నిర్మాణం చేపట్టేలా డిసైడ్ చేసింది.
ముందుగా సుందిళ్ల, అన్నారం
ఈ మూడు బ్యారేజీల్లో ముందుగా సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు మరమ్మతులు చేయించాలని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగానే చిన్నపాటి మరమ్మతులు అవసరం ఉన్న సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు పూర్తిస్థాయిలో రిపేర్లు చేయించి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత మేడిగడ్డ రిపేరును చేయనున్నారు. అయితే.. ఇందుకోసం ముందుగా మరోసారి వివిధ రకాల టెస్టులను చేయించనున్నారు. జియోటెక్నికల్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్‌తోపాటు హైడ్రాలిక్ అసెస్‌మెంట్స్ చేయనున్నారు. కాగా.. ఇప్పటికే ప్రభుత్వం దీని మీద వర్క్‌షాప్ సైతం అధికారులకు పూర్తిచేసింది. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాక వెంటనే ఈ సీజన్‌లోనే సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు మరమ్మతు చేయించనున్నారు. అటు మేడిగడ్డకు సైతం ఈ సీజన్‌లోనే డిజైన్లు ఫనల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ‘డిజైన్ ఫ్లడ్‌కు అనుగుణంగా హైడ్రాలిక్ డిజైన్లు ఇవ్వాలి. రాఫ్ట్ కటాఫ్ స్ట్రెంథ్‌ను అంచనా వేయాలి. సీపేజీ, సుడిగుండాల వంటి వాటిని నిరోధించే చర్యలకు డిజైన్లు ఇవ్వాలి. రాఫ్ట్ కింద ఏవైనా గోతులున్నాయోమో అంచనా వేయాలి. వాటిని పూడ్చేందుకు అవసరమైన చర్యలను సిఫార్సు చేయాలి. రేడియల్ గేట్ సీట్ పొజిషనింగ్, వాటి పనితీరుపైనా డిజైన్లు చేయాలి’ అని ఎన్‌డీఎస్ఏ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఒకటి, రెండు రోజుల్లోనే కన్సల్టెన్సీ ఫైనల్
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై సర్కారు పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. అనుభవం, అర్హత ఉన్న సంస్థలకే డిజైన్ల బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే వివిధ ప్రాజెక్టులు, డ్యామ్‌ల నిర్మాణాల్లో డిజైన్లు చేసిన అనుభవం ఉండాలని నిబంధనల్లో పేర్కొంది. కనీసం ఐదేండ్ల ఎక్స్‌పీరియన్స్ అవసరమని తేల్చి చెప్పింది. మరీ ముఖ్యంగా సీకెంట్ పైల్స్ టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టుల్లో రీహాబిలిటేషన్ వర్క్స్‌లో పనిచేసిన అనుభవం ఉండాలని సూచించింది. ఒకవేళ సంస్థలు సబ్‌కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం.. అది పని విలువలో 25 శాతానికి మించకూడదని వెల్లడించింది. ఈవోఐ వేసే సంస్థ.. 15 ఏండ్లలో కనీసం 3 ప్రాజెక్టుల్లోనైనా ఇలాంటి పనిచేసి ఉండాలని పేర్కొంది. అయితే.. ఎంపిక చేసిన సంస్థలకే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ సబ్మిషన్కు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఎన్‌డీఎస్ఏ రిపోర్టుకు అనుగుణంగానే పనులను చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాఫర్ డ్యామ్, కటాఫ్, ఎనర్జీ డిసిపేషన్ అరేంజ్‌మెంట్స్, గైడ్‌బండ్స్/ఫ్లడ్ బ్యాంక్స్, గోతులను పూడ్చడం, సీకెంట్‌పైల్స్, సీపేజీ నివారణ, బ్యారేజీ పగుళ్లకు రిపేర్ల వంటి వాటికి డిజైన్లు ఇవ్వాలని తెలిపింది. అయితే.. ఇప్పటికే మూడు కన్సల్టెన్సీలు వారి అనుభవాన్ని పొందుపరుస్తూనే మేడిగడ్డ పునరుద్ధరణకు సంబంధించి డిజైన్లను అందించారు. కాగా.. ఒకటి రెండు రోజుల్లోనే అధికారులను ఒక కన్సల్టెన్సీని ఫైనల్ చేయబోతున్నారని తెలిసింది. ఇప్పటికే నీటి పారుదల శాఖ అధికారుల వద్ద కంపెనీ పేరు ఫైనల్ కాగా.. సెక్రెటరీ ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాక ఆ కంపెనీ పేరును ఫైనల్ చేసి ప్రకటించనున్నారు.
పరీక్షల కోసం ఎల్‌అండ్‌టీ ఏర్పాట్లు
మరోవైపు ఒకటి, రెండు రోజుల్లో డిజైన్లకు సంబంధించి కన్సల్టెన్సీని ఫైనల్ చేయనున్నారు. కన్సల్టెన్సీ పేరు ప్రకటించిన తర్వాత వెంటనే ఆ మూడు బ్యారేజీల వద్ద టెస్టులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ముందుగా సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ప్రియారిటీ ఇవ్వనుండగా.. అక్కడ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. ఈ పరీక్షల కోసం నిర్మాణ సంస్థ అయిన ఎల్అండ్‌టీనే తగిన ఏర్పాట్లు చూసుకుంటున్నట్లు తెలిసింది. టెక్నికల్ టీంకు పూర్తిస్థాయిలో సపోర్టు చేసేందుకు ముందుకు వచ్చింది.
పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
కాగా.. ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థ ఎల్అండ్‌టీనే చూడాలని ముందు నుంచీ ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. కానీ, ఎల్అండ్‌టీ మాత్రం అందుకు ససేమిరా అంటూనే ఉన్నది. ప్రస్తుతం టెస్టులు, సర్వే నిమిత్తం ముందుకు వచ్చినా తదుపరి పునరుద్ధరణ పనులకు మాత్రం సంస్థ అంగీకరించడం లేదు. దాంతో ఈ విషయమై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నది. అందులోభాగంగానే ముందుగా టెస్టులు పూర్తిచేశాక.. డిజైన్లు రూపొందించాక.. ఆ తరువాత నిర్మాణ సంస్థతో మరోసారి చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. ఒకవేళ నిర్మాణ సంస్థ ససేమిరా అంటే లీగల్‌గా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. క్రిమినల్ ప్రొసీజర్‌కు సైతం వెనుకాడేది లేదంటే ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆ సంస్థకు సూచనా ప్రాయంగా చెప్పినట్లు సమాచారం.






