కాళేశ్వరంతో నీళ్లిచ్చింది ఆరున్నర లక్షల ఎకరాలకే.. ఎమ్మెల్సీ కవిత షాకింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-27 09:14:47  IST  )

తెలంగాణ జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కాళేశ్వరంతో నీళ్లిచ్చింది ఆరున్నర లక్షల ఎకరాలకే.. ఎమ్మెల్సీ కవిత షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఉరుకులు పరుగులు పెట్టినట్లు నిర్మించినట్లే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (PRLIS)ను కూడా వేగంగా పూర్తి చేసి ఉంటే ఇవాళ దక్షిణ తెలంగాణ ఎన్నికల ఫలితం వేరుగా ఉండేదని ఆమె అన్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో జాగృతి జనం బాటలో కార్యక్రమంలో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం రిజర్వాయర్, పంప్ హౌస్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలపై కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నది దాదాపు 300 కి.మీ. పొడవునా ప్రవహిస్తున్నప్పటికీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి కృష్ణా జలాల విషయంలో అన్యాయమే జరిగిందని ఆరోపించారు. తెలంగాణకు కృష్ణా నది నీటి వాటా 550 టీఎంసీలు రావాల్సి ఉండగా, అందులో కనీసం 299 టీఎంసీలను కూడా సరిగా వినియోగించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము వట్టె రిజర్వాయర్‌ను పరిశీలించామని, ఆ ప్రాజెక్టుకు సంబంధించి కాలువలు, వ్యవస్థ ఎక్కడా తయారు కాలేదన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని.. అది నిజమేనని అన్నారు. కానీ, అసలు మహబూబ్‌నగర్ జిల్లా భారతదేశంలోనే నెంబర్‌వన్ జిల్లా అని.. అందులో 25 లక్షల ఎకరాల్లో పంటలు పండించే భూములే ఉన్నాయని తెలిపారు.

తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్రం వచ్చి నేటికి 11 ఏళ్లు గడుస్తున్నా.. జిల్లాలో ఉన్న 25 లక్షల ఎకరా సాగు భూమికి కాళేశ్వరం (Kaleshwaram) ద్వారా కేవలం 6.5 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడం గొప్పతనమా అని బీఆర్ఎస్ నేతలను కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దక్షిణ తెలంగాణలోని పాలమూరు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని కవిత ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 12.3 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో 2015లో రూ.35,200 కోట్ల అంచనాతో ప్రారంభమైందని కవిత అన్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.58 వేల కోట్లకు పెరిగిందన్నారు. 2023లో మొదటి దశ ప్రారంభమైనప్పటికీ, పూర్తి స్థాయి పనులు జరగడం లేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో మాత్రం జాప్యం జరుగుతోందని కవిత అన్నారు.

Read More..

రెండేళ్ల‌లో పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కి త‌ట్టెడు మ‌ట్టి తీయ‌లేదు : ఎమ్మెల్సీ క‌విత

Next Story