మరోసారి కాళేశ్వరం ఎంక్వయిరీ కమిషన్ గడువు పొడిగింపు

by Yella Dhawani Reddy |

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డ్యామేజీలపై విచారిస్తున్న కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

మరోసారి కాళేశ్వరం ఎంక్వయిరీ కమిషన్ గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డ్యామేజీలపై విచారిస్తున్న కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ దీనిపై విచారిస్తుంది. గతేడాది మార్చిలో ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ నుంచి విచారణ ప్రారంభమైంది. ఇప్పటివరకు ఉన్న గడువు ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ వరకూ గడువు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఇప్పటికే ఈ కమిషన్ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, మాజీ ఈఎన్‌సీలతోపాటు చీఫ్‌ ఇంజినీర్లు, ఎస్‌ఈలను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇతర హోదాల్లో పనిచేసిన ప్రస్తుత, మాజీ ఐఏఎస్‌లను పూర్తిస్థాయిలో విచారించి.. బ్యారేజీల నిర్మాణంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? ఎవరు చెబితే వాటిని అమలు చేశారు? అనే అంశాలపై సాక్ష్యాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. కాగా, చంద్రఘోష్ ఈ నెల 23న తదుపరి విచారణ నిమిత్తం హైదరాబాద్ వస్తున్నారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగనుంది. అయితే, ఈసారి గత ప్రభుత్వ పెద్దలను కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.

Next Story