తుది దశకు కాళేశ్వరం విచారణ.. హైదరాబాద్ చేరుకున్న కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్

by Gantepaka Srikanth |

మేడిగడ్డ అంశంలో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నిమిత్తం ఈసారి కీలక నేతలు హాజరవ్వబోతున్నారు.

తుది దశకు కాళేశ్వరం విచారణ.. హైదరాబాద్ చేరుకున్న కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ అంశంలో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నిమిత్తం ఈసారి కీలక నేతలు హాజరవ్వబోతున్నారు. మరోవైపు.. కమిషన్ విచారణ సైతం చివరి అంకానికి చేరుకుంది. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ శుక్రవారం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. కీలక నేతల విచారణ కోసం ఇప్పటికే బుధవారం సాయంత్రం చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే.. ఈ నెల 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావును విచారించనున్నారు. అలాగే.. మాజీ సీఎం కేసీఆర్‌ను సైతం విచారణకు పిలిచారు. అయితే.. ఈ నెల 5న హాజరుకావాలని ముందుగా ఆయనకు నోటీసులు పంపించారు. తాను ఆ రోజు హాజరుకాలేనని.. ఈనెల 11వ తేదీన విచారణకు వస్తానని కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కమిషన్ అంగీకరించింది. దాంతో ఆయన ఈ నెల 11న విచారణకు హాజరుకానున్నారు. కాగా.. కమిషన్ గడువు ఇప్పటికే ప్రభుత్వం జూలై 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. వీరి విచారణ తరువాత మేడిగడ్డపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

Next Story