కవిత జైలు బాటలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు : కడియం శ్రీహరి

by Bhanu |

అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్న పరిస్థితి కల్వకుంట్ల కుటుంబానికి ఎదురైంది అని ఎమ్మెల్యే

కవిత జైలు బాటలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు : కడియం శ్రీహరి
X

దిశ, లింగాలఘణపురం: అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్న పరిస్థితి కల్వకుంట్ల కుటుంబానికి ఎదురైంది అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. గురువారం జీడికల్ నుండి జనగాం వరకు రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించబోయే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ, “ప్రజలు ఇచ్చిన అధికారం దుర్వినియోగం చేస్తే, కాలేశ్వరం, ఫోన్ టాపింగ్, లిక్కర్ స్కాంలు వెలుగులోకి వచ్చాయి. కవిత జైలుకు వెళ్లింది. త్వరలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా అదే బాటలో నడిచే పరిస్థితి కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు.

ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని, ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ హామీలు నెరవేర్చుతోందని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోన్న బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. బీసీలకు ప్రేమ ఉంటే బీజేపీ 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

“బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం 9.7 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. మండలంలో 488 కార్డులు జారీ చేశాం. 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నారు,” అన్నారు.

సిరిపురం, కళ్లెం, జీడికల్ గ్రామాల రోడ్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 14 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. మూడు నెలల్లో రామచంద్రస్వామి కళ్యాణానికి ముందే రోడ్డు పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, ఆర్డీవో వెంకన్న, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో రఘురామకృష్ణ, డీఎస్ఓ సరస్వతి, మిత్ర పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Next Story