- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడియం శ్రీహరి వ్యవహారం.. సీఎంకు కొండా సురేఖ మూడు పేజీల లేఖ
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారశైలిపై సీఎం రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్/వరంగల్ బ్యూరో: స్టేట్ పాలిటిక్స్‌లో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) వ్యవహార శైలి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండా, ఆ శాఖ అధికారులతో కడియం అధికారిక సమీక్ష నిర్వహించడం పట్ల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి అధికారికంగా ఫిర్యాదు చేస్తూ మూడు పేజీల లేఖ రాశారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలను, మంత్రిగా తన అధికార పరిధిని పూర్తిగా బేఖాతరు చేశారని సీఎంకు రాసిన లేఖలో మంత్రి సురేఖ పేర్కొన్నారు.
మంత్రిని పక్కనబెట్టి సమీక్షలేంటి..?
దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన, విధాన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలు పూర్తిగా సంబంధిత శాఖా మంత్రి పరిధిలోకి వస్తాయని కొండా సురేఖ స్పష్టం చేశారు. అయినా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ డైరెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులను సమావేశపరిచి.. పలు దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, దేవాలయ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై అధికారిక సమీక్ష నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు. అధికారులకు గడువులు నిర్దేశించడం వంటి చర్యలు చేపట్టడం పరిపాలనా పరంగా తీవ్ర అభ్యంతరకరమని, ఇది ప్రభుత్వ ‘రూల్స్ ఆఫ్ బిజినెస్’ (Rules of Business) స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
క్రమశిక్షణా చర్యలకు డిమాండ్..
రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన కడియం శ్రీహరి లాంటి ప్రజాప్రతినిధికి, శాఖా పరంగా విధానపరమైన నిర్ణయాలు మంత్రి ఆధ్వర్యంలోనే జరగాలనే విషయం తెలుసని మంత్రి కొండ సురేఖ లేఖ ప్రస్తావించారు. అలాంటప్పుడు మంత్రినైన తనను పూర్తిగా పక్కనపెట్టి సమీక్షలు నిర్వహించడం ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి దారితీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వంలో పరిపాలనా సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా, అధికార యంత్రాంగంలో తీవ్ర అయోమయ పరిస్థితులకు దారితీస్తాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాం ఘటనలు పునరావృతం కాకుండా పార్టీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి, కడియం శ్రీహరి నుంచి వివరణ కోరడంతో పాటు, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.






