పట్టుదలతో శ్రమిస్తేనే విజయ తీరాలకు చేరగలం

by Naga Rani Yarlagadda |

క్రీడలు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శక్తిమంతమైన సాధనాలని, శారీరక ఆరోగ్యం, మానసిక ధైర్యం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే తత్వం కూడా అలవడుతుందని భారత కబడ్డీ హెడ్‌ కోచ్‌ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

పట్టుదలతో శ్రమిస్తేనే విజయ తీరాలకు చేరగలం
X
  • క్రమశిక్షణతోనే క్రీడాకారులుగా రాణిస్తాం
  • భారత కబడ్డీ కోచ్‌ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: క్రీడలు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శక్తిమంతమైన సాధనాలని, శారీరక ఆరోగ్యం, మానసిక ధైర్యం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే తత్వం కూడా అలవడుతుందని భారత కబడ్డీ హెడ్‌ కోచ్‌ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టుదల, క్రమశిక్షణతో శ్రమిస్తేనే క్రీడాకారులుగా రాణించగలుగుతారని పేర్కొన్నారు. మంగళవారం దోమలగూడలోని గవర్నమెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ (జీసీపీఈ)లో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన తన ప్రతిభను పాఠశాల స్థాయిలో వ్యాయాయ ఉపాధ్యాయుడు పసిగట్టి ప్రోత్సహించడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించారు. 2018 ఏషియన్‌ గేమ్స్‌లో భారతీయ మహిళా జట్టు కబడ్డి హెడ్‌ కోచ్‌గా, దుబాయిలో 2018లో భారతీయ పురుషుల కబడ్డీ జట్టు కోసం హెడ్‌ కోచ్‌గా మెడల్స్‌ సాధించడం తన జీవితంలో చిరకాలం గుర్తుండి పోయే ఘటనగా పేర్కొన్నారు. ప్రొకబడ్డీ లీగ్‌లో వివిధ కబడ్డీ జట్లకు కోచ్‌గా, కామెంటేటర్‌గా తన ప్రస్తానాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల్లో క్రీడాసక్తిని గుర్తించి వారిని ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో వ్యాయాయ ఉపాధ్యాయులదే కీలకమైన పాత్ర అని పేర్కొన్నారు.

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీలో క్రీడా శిక్షణలో తర్ఫీదు పొందుతున్న విద్యార్థులు భవిష్యత్తులో వ్యాయాయ ఉపాధ్యాయులుగా రాణించి దేశ క్రీడా రంగానికి ఆణిముత్యాలను అందించాలని కోరారు. గ్రామీణ స్థాయిలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చి క్రీడా రంగం అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. క్రీడా శిక్షకులుగా చేసే శ్రమ రేపటి తరం విజయాలకు పునాదిగా నిలుస్తుందన్నారు. కాలేజీలో నేర్చుకున్న పాఠాలు, ఆటల ద్వారా పొందిన అనుభవం రేపటి తరం జీవితాన్ని గాఢంగా ప్రభావితం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ధరణి కొండా, కేవీఎస్‌ఎన్‌ లక్ష్మి, తెలంగాణ పీఈటీ అసోసియేషన్‌ అధ్యక్షులు టి.విజయ సాగర్‌ పాల్గొన్నారు. జీసీపీఈ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజారావు అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ సమావేశంలో డాక్టర్‌ సి.కుముదిని, డాక్టర్‌ ఏ.సిద్దార్ద, డాక్టర్‌ సంధ్య శ్రీ, గోవర్దన్‌రెడ్డి, డాక్టర్‌ బి.మాధవి, జగన్మోహన్‌గౌడ్‌, బి.లతాశ్రీ, శివరాజ్‌, దినేశ్‌, కోమల్‌, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Next Story