Save Nimisha Priya: సేవ్ నిమిష ప్రియ.. కేఏపాల్ ఉద్యమం

by Ramesh Naini |   (  Updated:2025-08-20 09:20:37  IST  )

కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Save Nimisha Priya: సేవ్ నిమిష ప్రియ.. కేఏపాల్ ఉద్యమం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ నర్సు నిమిషా ప్రియ (Nimisha Priya) మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. కేరళ నర్సు ప్రాణాలు కాపాడటానికి ఆమె కుటుంబం, భారత ప్రభుత్వం, మత పెద్దలు, మరోవైపు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ (KA Paul) సైతం తీవ్ర కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సేవ్ నిమిష ప్రియ (Save Nimisha, Save India’s Youth) అంటూ కేఏపాల్ ఉద్యమం ప్రారంభించారు. ఈ మేరకు నర్సును కాపాడేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం దియా (బ్లడ్‌మనీ) నష్టపరిహారం కోసం విరాళాలు సేకరించడానికి ఆయన సిద్దమైనట్లు తెలుస్తోంది. నిమిషా ప్రియ హత్య చేసిన వ్యక్తి కుటుంబానికి బ్లడ్‌మనీ ద్వారా రూ.8.3 కోట్లు ఇచ్చి ఒప్పించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మంగళవారం ఢిల్లీలో ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేరళ నర్సు నిమిష ప్రియను రక్షించడానికి పిలుపునిచ్చారు. యెమెన్ జైలు నుంచి నిమిష ప్రియ నుంచి తనకు లేఖ వచ్చినట్లు కేఏపాల్ తెలిపారు.

‘మేము 30 రోజుల్లో, సెప్టెంబర్ 20 నాటికి ఒక మిలియన్ డాలర్ల బ్లడ్ మనీని అందజేస్తాము, మీ కుటుంబ భద్రత రక్షణతో పాటు మీరు కోరుకున్న ఏ దేశంలోనైనా పౌరసత్వం నిర్ధారిస్తాము. అలాగే, యెమెన్ యుద్ధాన్ని పరిష్కరించి, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో దేశ అవసరాలను తీరుస్తాము. దయచేసి కరుణ చూపండి’ అంటూ బాధిత కుటుంబానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన భారత విదేశాంగ శాఖ బ్యాంకు ఖాతాకు విరాళాలు పంపించాలని పేర్కొన్నారు. కాగా, కేరళ నర్సును క్షమించేది లేదని, బ్లడ్ మనీ తీసుకోమని గతంలో హత్యకు గురైన వ్యక్తి సోదరుడు స్పష్టం చేశారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలని, షరియా చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాధిత కుటుంబం నష్టపరిహారంగా బ్లడ్‌మనీ స్వీకరిస్తారా? విషయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తనను కాపాడాలని నిమిష ప్రియ అప్పీల్‌ను సుప్రీం కోర్టు స్వీకరించి, ఆగస్టు 22కు విచారణ వాయిదా వేసింది. కేఏపాల్ ట్వీట్.. దీనిపై విదేశాంగ శాఖ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.


Next Story