తుది నివేదిక రెడీ అవుతోంది.. న్యాయం చేస్తాం: కే. కేశవరావు

by Vemula.Srinu Prasad |

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారుల గుర్తింపు, వారి సంక్షేమమే ఆశయంగా ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ అధికారిక సమావేశాలు సచివాలయం ఎదురుగా ఉన్న తెలంగాణ అమర జ్యోతి ప్రాంగణంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి...

తుది నివేదిక రెడీ అవుతోంది.. న్యాయం చేస్తాం: కే. కేశవరావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారుల గుర్తింపు, వారి సంక్షేమమే ఆశయంగా ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ అధికారిక సమావేశాలు సచివాలయం ఎదురుగా ఉన్న తెలంగాణ అమర జ్యోతి ప్రాంగణంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఓయూ, కేయూ విద్యార్ధి జేఏసీ నేతలతో సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ బుధవారం జేఎన్‌టీయూహెచ్, తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్), మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్లగొండ), పాలమూరు యూనివర్సిటీ (మహాబూబ్ నగర్), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్), తెలుగు విశ్వవిద్యాలయం, ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్ధి జేఏసీ నేతలు, మలిదశ ఉద్యమకారులతో సమావేశమయ్యారు. కమిటీ చైర్మన్ కె. కేశవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి ఉద్యమకారులు మరియు అధ్యాపక ప్రతినిధులు అనేక అంశాలపైన చర్చలు జరిపారు.

సామాజిక సంస్కరణలపై ప్రత్యేక దృష్టి...

సమావేశంలో పాల్గొన్న వివిధ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు తమ ఆకాంక్షలను, విలువైన సలహాలను కమిటీ ముందు ఉంచారు. ఉద్యమకారులను కేవలం రాజకీయాల కోణంలో కాకుండా పారదర్శకంగా గుర్తించాలని వారు కోరారు. కేవలం ఐడెంటిటీ కార్డుల జారీతో సరిపెట్టకుండా, ఉద్యమ సమయంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి విద్యా, వైద్య, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మకమైన సామాజిక సంస్కరణలు తీసుకురావాలని, తద్వారా ఆయా కుటుంబాలకు శాశ్వత సామాజిక భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కె. కేశవరావు మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమ రథసారధులు మన విద్యార్థులు, మేధావులు ఈ సమావేశాలలో వివిధ వర్సిటీల నుండి వచ్చిన ప్రతినిధులు అత్యంత విలువైన ప్రతిపాదనలను, సామాజిక సంస్కరణల విజ్ఞాపనలను కమిటీకి అందించారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, నిఖార్సైన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని గుర్తించి, గౌరవించడమే మా ప్రభుత్వ ప్రధాన సంకల్పమని కేశవరావు తెలిపారు. తాము సేకరించిన అన్ని నివేదికలను, సామాజిక భద్రతా ప్రతిపాదనలను త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, ఉద్యమకారుల త్యాగాలకు తగిన న్యాయం జరిగేలా కమిటీ తుది నివేదికను పారదర్శకంగా సిద్ధం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ప్రొఫెసర్ ఎమ్. కోదండరాం, ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థి ఉద్యమకారులు పాల్గొన్నారు.

Next Story