ఏఐతో మానవ మేథస్సు మిళితమైతేనే మంచి ఫలితాలు.. ఏఐ యుగంలో జర్నలిజంపై కే. కేశవరావు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

కృత్రిమ మేధస్సు (AI)తో మానవ మేధస్సును మిళితం చేస్తేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) డా. కె. కేశవరావు అన్నారు.

ఏఐతో మానవ మేథస్సు మిళితమైతేనే మంచి ఫలితాలు.. ఏఐ యుగంలో జర్నలిజంపై కే. కేశవరావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృత్రిమ మేధస్సు (AI)తో మానవ మేధస్సు (Human intelligence)ను మిళితం చేస్తేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) డా. కె. కేశవరావు (K. Keshava Rao) అన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ శాఖ, తెలంగాణ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమైన "కృత్రిమ మేథస్సు యుగంలో జర్నలిజం భవిష్యత్తు, అవకాశాలు, సవాళ్లు" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. కేశవరావు మాట్లాడుతూ, విలువలతో కూడిన సమాచార వ్యాప్తి అవసరమని, మనస్సాక్షిని మించిన సాంకేతికత లేదని స్పష్టం చేశారు. వార్తల పునర్ సమీక్ష, తనిఖీ తప్పనిసరని, కచ్చితత్వం, ప్రామాణికతతో కూడిన పాత్రికేయ వృత్తి కొనసాగాలని సూచించారు. వార్తల సేకరణ, ప్రక్రియను సులభతరం చేయడానికి ఏఐ అధునాతన సాధనమైనప్పటికీ, ప్రస్తుతం ప్రసారమవుతున్న నకిలీ వార్తలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మనిషి మేధస్సుతో పోలిస్తే ఏఐకి పూర్తి అవగాహన ఉండదని, సామాజిక-సాంస్కృతిక సందర్భోచితంగా సమాచారాన్ని జర్నలిస్టులు మార్చాల్సిన అవసరం ఉందని వివరించారు.

వార్తల్లో విశ్వసనీయతకు ప్రాధాన్యం:

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. డి.వి.ఆర్. మూర్తి ఉపన్యాసం చేస్తూ, నైతికతతో కృత్రిమ మేధస్సును ఉపయోగించడంపై చాలా మీడియా పరిశ్రమలు విఫలమవుతున్నాయని సర్వేలు వెల్లడించాయని తెలిపారు. ఏఐ సృష్టించిన వార్తల్లో విశ్వసనీయత లోపించిందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని చెప్పారు. సాంకేతికతను వినియోగించి నప్పటికీ, విశ్వసనీయత, వార్తా లక్ష్యాలు, విలువలు తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. విలువలతో కూడిన పాత్రికేయ విద్యా పాఠ్యప్రణాళికలను రూపొందించాలని సూచించారు.

ఏఐని నైతికతతో వినియోగించుకోవాలి:

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అదనపు డైరెక్టర్ జనరల్ (హైదరాబాద్) శృతి పాటిల్ విశిష్ట అతిథిగా హాజరై, వేగం, సామర్థ్యం, పరిశోధనాత్మక జర్నలిజంతో సహా వాస్తవ తనిఖీ సాధనాల వంటి అవకాశాల కోసం ఏఐని నైతికతతో ఉపయోగించుకోవాలని అన్నారు. పాత్రికేయ వృత్తి నిర్వహణలో ఏఐ భాగమైందని, సాంకేతికతను సమర్థవంతంగా, సరైన తనిఖీతో నిర్దారించుకోవాలని సూచించారు.

సదస్సుకు అధ్యక్షత వహించిన డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, డిజిటల్ పరివర్తనకు భారతీయ జర్నలిజం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కంటెంట్ విశ్వసనీయత, ఉద్యోగ స్థిరత్వం వంటి సవాళ్లు ఉన్నాయని, ఏఐ అనువర్తనాన్ని చర్చించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఈ సదస్సు మొదటి రోజు రెండు టెక్నికల్ సెషన్లు, ఒక పనెల్ డిస్కషన్ నిర్వహించారు. రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి, డైరెక్టర్, డీన్ ప్రొ. శ్రీనివాస్ వడ్డాణం, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Next Story