భూ సమస్యల పరిష్కారానికి ‘న్యాయ గంట’

by Muthe.Rajitha |

రెండు తెలుగు రాష్ట్రాల రైతులు, భూ హక్కుదారులకు సమస్యల పరిష్కారం కోసం లీఫ్స్ సంస్థ న్యాయ గంట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.

భూ సమస్యల పరిష్కారానికి ‘న్యాయ గంట’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల రైతులు, భూ హక్కుదారులకు సమస్యల పరిష్కారం కోసం లీఫ్స్ సంస్థ న్యాయ గంట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. భూ సమస్యల పరిష్కారానికి ఉచితంగా సలహాలు పొందొచ్చు. ఎవరైనా ఫోన్ ద్వారా తమ సమస్యలు చెప్పుకుంటే రెవెన్యూ చట్టాలు, కోర్టుల ద్వారా ఏ విధంగా న్యాయం పొందొచ్చునో రెవెన్యూ చట్టాల నిపుణుడు, వ్యవసాయ కమిషన్ సభ్యులు ఎం.సునీల్ కుమార్(భూమి సునీల్) వివరిస్తారు. ఈ అవకాశం ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల వరకు కొనసాగుతుంది. ఇప్పటికే 400 వారాలకు పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనివార్య కారణాల వల్ల నిలిచిన న్యాయ గంట కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. ఈ అవకాశాన్ని రైతులు, పట్టాదారులు సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రతి శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

భూమి సునీల్ తో న్యాయ గంట లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం పేరిట నడుస్తున్నది. ఫోన్ చేసిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల రైతులకు వ్యవసాయ భూముల సమస్యలకు న్యాయ సలహాలు అందించనున్నారు. ఫోన్ చేయాల్సిన నంబరు 90635 71205. పాత పట్టాదారు పాసుపుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రం ఉండి కొత్త పాసు పుస్తకం రాకపోయినా, ఓఆర్సీ ఉండి పాసు పుస్తకం రాకపోయినా పరిష్కారం ఎట్లా అన్నది తెలుసుకోవచ్చు. అలాగే లావునీ పట్టా భూములకు పాసు పుస్తకం రాకపోయినా, 38ఈ సర్టిఫికేట్ ద్వారా హక్కులు పొందడం, వ్యవసాయ భూమి 'నాలా' అని నమోదు అయినప్పుడు ఏం చేయాలి వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు.

పట్టా భూమిని అసైన్‌ / ప్రభుత్వ / సీలింగ్‌ / వక్స్‌ / దేవాదాయ భూమి అని నిషేదిత జాబితాలో చేర్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి? ఒక సర్వే నంబర్‌ లో కొంత అసైన్స్‌ / ప్రభుత్వ / సీలింగ్‌ / దేవాదాయ భూమి ఉండగా ఆ సర్వే నంబరులోని మొత్తం విస్తీర్ణాన్ని నిషేదిత జాబితాలో పేర్కొన్నప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? భూ సేకరణలో పోయిన దాని కంటే ఎక్కువ భూమిని రికార్డుల నుంచి తొలగించినప్పుడు, ఒకరి భూమి భూసేకరణలో పోతే వేరొకరి భూమిని రికార్డుల నుంచి తొలిగించినప్పుడు పరిష్కార మార్గాలేమిటో తెలుసుకోవచ్చు. ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఏ అధికారిని సంప్రదించాలో న్యాయ గంట ద్వారా సూచనలు పొందొచ్చు. అలాగే ఏయే పత్రాలు జత చేయాలో కూడా అర్ధం చేసుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది.




Next Story