‘కాళేశ్వరం’పై కమిషన్ రిపోర్టు రెడీ.. నేడో, రేపో సర్కార్‌కు అందజేత

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-28 02:39:18  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను సిద్ధం చేసింది.

‘కాళేశ్వరం’పై కమిషన్ రిపోర్టు రెడీ.. నేడో, రేపో సర్కార్‌కు అందజేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండటంతో రేపో, మాపో ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించనున్నది. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్​ చేరుకున్నారు. నివేదికకు తుది మెరుగులు దిద్ది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమయం ఇవ్వగానే రిపోర్టు సమర్పించనున్నారు.

116 మందికి పైగా విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని లోపాలు, వాటికి బాధ్యులు, తదితర వాటిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్​ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ను ప్రభుత్వం 2024‌లో ఏర్పాటు చేసింది. ఆనాటి నుంచి ఆయన 116 మందికి పైగానే విచారించారు. ఇందులో ఇంజినీర్లు, ఈఎన్‌సీ, ఐఏఎస్​అధికారులు ఉన్నారు. నాటి సీఎం, మంత్రులను సైతం విచారించి వారి వాదనలను విన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, ఒప్పందాలు, నిధుల విడుదల, తదతరాలను పరిశీలించి 300పైగా పేజీలతో నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను ప్రభుత్వానికి అందించిన తర్వాత సర్కారు.. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. మంత్రివర్గ ఉప సంఘం దానిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అనంతనం దానిని కేబినెట్‌లో చర్చించి అసెంబ్లీ ముందు ఉంచనున్నది. అసెంబ్లీలోనూ చర్చించిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే ఎన్‌డీఎస్‌ఏ నివేదిక, విజిలెన్స్​నివేదికలతో ఇంజినీర్లకు పదోన్నతులు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో జస్టిస్​పీసీ ఘోష్​నివేదిక ఆధారంగా ఎవరిపై చర్యలుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story