సమావేశాలేనా.. ఇన్‌కం‌పై ఫోకస్ పెట్టండి..! రెవెన్యూ కమిటీపై సీఎం రేవంత్ అసహనం

by Kema Shiva Kumar |

ఖర్చు చేయడం కాదు.. ఆదాయం పెంచడంపై ఫోకస్ పెట్టాలని రెవెన్యూ రిసోర్స్ మొబైలేషన్ సబ్‌ కమిటీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సమావేశాలేనా.. ఇన్‌కం‌పై ఫోకస్ పెట్టండి..! రెవెన్యూ కమిటీపై సీఎం రేవంత్ అసహనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఖర్చు చేయడం పెద్ద విషయం కాదని, ఆదాయం పెంచడంపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు సమాచారం. వంద రోజుల్లో ఆదాయం పెంచడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న జరిగిన కేబినెట్​ సమావేశంలో రెవెన్యూ రిసోర్స్​మొబైలేషన్​ కేబినెట్​ సబ్‌​కమిటీ పనితీరుపై సీఎం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. రాష్ట్రంలో ఓవైపు ఉద్యోగులు, రిటైర్డ్​ ఉద్యోగుల బకాయిలు పేరుకుపోతుండటం, మరోవైపు ప్రభుత్వ ఆదాయం పెంచడంపై సరైన దృష్టి సారించడంలేదని సబ్‌కమిటీపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టు తెలిసింది. సమావేశాలు పెడుతున్నారు తప్ప ఫలితం మాత్రం కనిపించడం లేదని సీఎం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన నాటి నుంచి అనేక మార్లు సమావేశమయ్యారని, ఇంతవరకు ఫలితం లేదని, అసలు ఏం సాధించారని అడిగినట్టు తెలిసింది. సమావేశాలు పెట్టుకోవడం కాదని, రిజల్ట్​ కావాలని సీరియస్ అయినట్టు తెలిసింది.

నిధులు లేవని చెబితే ఊరుకోరు..

ప్రభుత్వానికి ఆదాయం పెంచడం ఎలా? అనే దానిపై సబ్‌కమిటీ బృందం ఆలోచించాలని, దృష్టి సారించాలని అన్నారు. ఆదాయం లేదని ఏం చేయలేకపోతున్నామంటే జనాలు ఊరుకోరని, అది ప్రభుత్వ వైఫల్యంగానే చూస్తారని అన్నారు. ఆదాయం పెంచుకోవడం ముఖ్యమని, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి పథకాలు అమలుచేయలేమని చెబితే బాగోదన్నారు.ఉద్యోగులు,రిటైర్డ్​ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం సాధ్యంకావడం లేదంటే ఎవరూ ఒప్పుకోరన్నారు. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలను గురించి ఎవరికీ అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్​ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలన్నారు. రాబోయే 100 రోజుల్లో ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్దం చేయాలని, అలా వచ్చిన ఆదాయంతో రిటైర్డ్​​ ఉద్యోగుల బకాయిలన్ని చెల్లించాలన్నారు. దీనికి అనుగుణంగా వెంటనే ప్రతిపాదనలు, ప్రణాళికలను రెవెన్యూ రిసోర్స్ మొబైలేషన్​ కేబినెట్ సబ్‌​కమిటీ తీసుకురావాలన్నారు. మే 4వ తేదీ కల్లా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అదే రోజున మళ్లీ కేబినెట్ సమావేశం నిర్వహిద్దామని సీఎం రేవంత్ అన్నట్టుగా తెలుస్తోంది.

Next Story