జూరాల కెపాసిటీ 14 లక్షల క్యూసెక్కుల టెన్షన్ వద్దు : మంత్రి శ్రీహరి

by Bhanu |

జూరాల ప్రాజెక్టు స్థిరంగా నిలబడినట్టే ఇప్పుడు కూడా అదే ధైర్యంగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

జూరాల కెపాసిటీ 14 లక్షల క్యూసెక్కుల టెన్షన్ వద్దు : మంత్రి  శ్రీహరి
X

దిశ, మక్తల్: జూరాల ప్రాజెక్టు స్థిరంగా నిలబడినట్టే ఇప్పుడు కూడా అదే ధైర్యంగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. శుక్రవారం మక్తల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గతంలో 14 లక్షల క్యూసెక్కుల భారీ వరద నీటి ప్రవాహాన్ని ఎదుర్కొన్న జూరాల ప్రాజెక్టు ఇప్పుడు లక్ష క్యూసెక్కుల వరదకు కుదేలవుతుందన్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో భయం సృష్టించే ఉద్దేశంతో చేస్తోందని విమర్శించారు.

గతంలో తెగిన రోప్‌వేలు చూసి ప్రాజెక్టుపై ముప్పు ఉందని చెబుతున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, కాలేశ్వరం కుంగిన పిల్లర్స్ ను చూసి వారు ఇంకా షాక్‌లోనే ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. తాను ఎప్పుడైనా, ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని మంత్రి అన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికీ మన్నించని స్థిరతతో ఉన్నాయని గుర్తు చేస్తూ, గత బీఆర్ఎస్ పాలనలో మరమ్మతులు, రిపేర్స్ పూర్తికాకుండానే ప్రాజెక్టులు ఆపి పెట్టారని విమర్శించారు.

స్వప్న సంస్థకు అప్పజెప్పిన పనుల వల్లే రోప్‌వేలు తెగిపోవడం వంటి సమస్యలు వచ్చాయని, ఇప్పుడు వాటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీపై మోపడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని అన్నారు. సంగంబండ్ ప్రాజెక్టులో హై లెవెల్, లో లెవెల్ కాలువల పనులను పూర్తిచేసి ఆయకట్టుకు నీరు అందించామని గుర్తు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ప్రజల ముందుకు వెళ్లి క్షమాపణ చెప్పే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పలు పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story