బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం.. ఏక చత్రాధిపత్యం : మంత్రి జూపల్లి

by Bhanu |

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నష్టపెట్టిందని, అభివృద్ధికి బదులుగా విధ్వంసం, ఏకచత్రాధిపత్యం కొనసాగిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.

బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం.. ఏక చత్రాధిపత్యం : మంత్రి జూపల్లి
X

దిశ, ఆదిలాబాద్ : గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నష్టపెట్టిందని, అభివృద్ధికి బదులుగా విధ్వంసం, ఏకచత్రాధిపత్యం కొనసాగిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. శుక్రవారం ఆదిలాబాద్ ప్రజాసేవ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జూపల్లి పేర్కొన్న వివరాల ప్రకారం, గతంలో 22 మంది సీఎంలు పాలించిన రాష్ట్రానికి అప్పు రూ.75 వేల కోట్ల పరిధిలో ఉండగా, బీఆర్ఎస్ పాలనలో అది రూ.8 లక్షల కోట్లకు చేరిందన్నారు. అభివృద్ధి కన్నా "గ్లోబెల్ ప్రచారానికే" ప్రధాన ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీపై కూడా విమర్శలు గుప్పించిన జూపల్లి... బీహార్, ఉత్తర్ ప్రదేశ్‌లకు కేంద్రం నిధులు కేటాయిస్తే, తెలంగాణకు ఎందుకు అన్యాయం జరుగుతుందన్న ప్రశ్నను వేశారు. రాష్ట్రానికి ఉన్న ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కేంద్రంలో తెలంగాణ తరఫున నిధుల కోసం ఏమి చేస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు. ‘‘మన ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు,’’ అని స్పష్టం చేశారు.

రైతులకు మద్దతుగా తమ ప్రభుత్వం ఎకరానికి రూ.10వేలు ఇచ్చిందని, బీఆర్ఎస్ పాలనలో పంట నష్టం అయినా కనీసం పరామర్శ చేయలేదని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల ఈఏఎంఐలకే రూ.600 కోట్లు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, సన్న బియ్యం వంటి పథకాలను కొనసాగిస్తున్నామని వెల్లడించిన జూపల్లి, అవినీతి లేని పారదర్శక పాలన అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, పై స్థాయి పర్యవేక్షణ తప్పనిసరి అన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక ప్రాధాన్యం కలిగిన అనేక ప్రాంతాలున్నాయని, వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఒక ప్రశ్నకు స్పందిస్తూ ‘‘దాంతో నాది కూడా ఉండొచ్చు’’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి, శ్యామ్ నాయక్, దిగంబర్ రావు పాటిల్, గోక గణేష్ రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story