సెక్రటేరియట్‌లో జూనియర్ ఐఏఎస్‌దే రాజ్యం

by Naga Rani Yarlagadda |

సాధారణంగా మంత్రులు.. తమ శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల చొరవను అస్సలు సహించరు. తాము చెప్పినట్లుగానే నడుచుకోవాలని, ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలని ఆదేశిస్తుంటారు.

సెక్రటేరియట్‌లో జూనియర్ ఐఏఎస్‌దే రాజ్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొన్ని రోజులుగా సెక్రెటేరియట్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది. ఓ శాఖ మంత్రి కన్నా అందులో పనిచేస్తున్న ఓ స్పెషల్ సెక్రెటరీ పవర్‌ఫుల్‌గా మారారని ప్రచారం సాగుతున్నది. సదరు స్పెషల్ సెక్రెటరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఫైల్స్ ముందుకు కదులుతున్నాయని, లేకపోతే ఎంతటి కీలకమైన ఫైల్ అయినా అటకెక్కడం ఖాయమనే టాక్ నడుస్తున్నది. ఈ పరిస్థితి సాధారణ లీడర్లతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం ఎదురైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు శాఖ మంత్రి సపోర్టుతోనే ఆ సెక్రెటరీ హవా నడుస్తున్నదనే చర్చ సెక్రెటేరియట్ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.

ఆ శాఖలో సదరు ఆఫీసరే సుప్రీం..

సాధారణంగా మంత్రులు.. తమ శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల చొరవను అస్సలు సహించరు. తాము చెప్పినట్లుగానే నడుచుకోవాలని, ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలని ఆదేశిస్తుంటారు. ఒకవేళ ఎవరైనా పరిధి దాటి వ్యవహరిస్తుంటే వెంటనే వారికి వార్నింగ్ ఇస్తుంటారు. అయినా వినకపోతే అక్కడ్నించి తప్పించి, తమ మాట వినే ఆఫీసర్లను సెక్రెటరీలుగా అపాయింట్ చేసుకుంటారు. కానీ, ప్రస్తుతం ఓ శాఖలో మంత్రి కన్నా ఓ జూనియర్ ఐఏఎస్ అధికారి హడావుడి ఎక్కువ అయిందనే విమర్శలు వస్తున్నాయి. ఆ ఆఫీసర్‌కు తెలియకుండా ఆ శాఖలో చీమ చిటుక్కుమనదనే సెటైర్లు వినపడుతున్నాయి. ఎంతటి కీలకమైన ఫైల్స్ అయినా సరే.. సదరు అధికారి ఒకే చెబితేనే కదులుతాయని, లేకపోతే పెండింగ్‌లో పడుతుంటాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ శాఖలో పనిచేసే అధికారుల ప్రమోషన్లు, బదిలీల్లో కూడా ఆ ఆఫీసర్ కీలకంగా వ్యవహరిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. చివరకు ఆ శాఖలోని హెచ్ఓడీ, జిల్లాల ఆఫీసుల్లో జరిగే రెగ్యులర్ యాక్టివిటీస్‌లోనూ ఆ అధికారి ప్రమేయం ఉంటుందని చర్చ జరుగుతున్నది.

మంత్రి సపోర్టు ఫుల్..

పెండింగ్ పనుల పూర్తి, కొత్త పనుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు సదరు శాఖ మంత్రి వద్దకు వెళ్లి వివరిస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇస్తుంటారు. కానీ, ఆ శాఖలో సదరు స్పెషల్ సెక్రెటరీ ఒకే చెబితేనే పని పూర్తవుతుందని టాక్. ఈ విషయంపై కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ‘మంత్రి కన్నా ఆ స్పెషల్ సెక్రెటరీ మాట ఎక్కవ నడుస్తది. ఆ ఆఫీసర్ చెప్పినట్లుగానే మినిస్టర్ వింటడు. ఏం దరఖాస్తు ఇచ్చినా ఆ ఆఫీసర్ కే రాస్తడు. మంత్రి ఎవరో, ఆఫీసర్ ఎవరో తెలియకుండా పోయింది’ అని మాట్లాడుకుంటున్నారు. సదరు అధికారికి మంత్రి అంతగా సపోర్టు ఇవ్వడం వెనుక పెద్ద కథే ఉందని, ఒకప్పుడు జిల్లా స్థాయిలో పనిచేస్తోన్న ఆ ఆఫీసర్‌ను మంత్రి ఏరికోరి సెక్రెటేరియట్‌లో పోస్టింగ్ ఇప్పించారనే ప్రచారం ఉన్నది. ఎందుకంటే ఆ శాఖ కార్యకలాపాలల్లో ఎలాంటి సమస్యలు రాకుండా అలర్ట్ చేసేందుకు ఆ అధికారి సూచనలు, సలహాలను తమ లీడర్ తీసుకుంటున్నారని మంత్రి సన్నిహితులు సమర్థిస్తున్నారు.

సీఎం నిఘా వర్గాల రిపోర్టు?

కొన్ని రోజులుగా ఆ శాఖలో జరుగుతున్న పరిణామాలపై అటు పార్టీలో ఇటు సెక్రెటేరియట్‌లో ఆసక్తికర చర్చల జరుగుతున్నది. ఎందుకు ఆ సెక్రెటరీకి అంతగా ప్రయారిటీ ఇస్తున్నారు? సీనియర్ ఆఫీసర్ కాకున్న కీలక పనులు అప్పచెప్పడం వెనుక ఆంతర్యం ఏంటీ? అని ఆరా తీస్తున్నారు. ఈ పరిణామాలపై నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. అలాగే బయట జరుగుతున్న ప్రచారాన్ని సైతం రిపోర్టు చేసినట్టు సమాచారం. ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రెటరీ హోదాలో ఉన్న ఐఏఎస్ సైతం ఆ జూనియర్ ఐఏఎస్ హడావుడిని చూసి వారించే ప్రయత్నం సైతం చేయడం లేదు. ఎందుకంటే ఆ ఆఫీసర్‌ను ఏమైనా అంటే మంత్రికి ఎక్కడ కోపం వస్తుందో అనే కారణంతో మౌనంగా ఉంటున్నట్టు తెలుస్తున్నది.

Next Story