కాంగ్రెస్ ని​ గెలిపిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి

by Muthe.Rajitha |

అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

కాంగ్రెస్ ని​ గెలిపిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ముదిరాజ్, టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి యూసుఫ్ గూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

నవీన్ యాదవ్ స్థానికుడు, మంచి సేవకుడు, ఏ పదవి ఉన్నా లేకున్నా స్థానికంగా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టిన వ్యక్తిని భట్టి విక్రమార్క అన్నారు. నవీన్ యాదవ్ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని, కాంగ్రెస్ మూల సిద్ధాంతాలను నమ్మి ఆచరించే వ్యక్తి అని తెలిపారు. ఆయనను గెలిపించుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మంత్రులందరినీ సమన్వయం చేసుకొని వేలకోట్ల నిధులతో మురికివాడలతో ఉన్న నియోజకవర్గం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని భట్టి విక్రమార్క తెలిపారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేసారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుమారు వంద కోట్లతో ఈ నియోజకవర్గం లోనే అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. హరీష్ రావు సీనియర్ నేత పదేళ్లు మంత్రిగా పనిచేశారు.. ఆర్థిక శాఖ కూడా నిర్వహించారు.. ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారని .. ఢిల్లీలో తనకు ఇల్లు ఉందో లేదో అందరికీ తెలుసునని అన్నారు. ఐటీ రైడ్స్ అధికారికంగా జరుగుతాయని, అందరికీ తెలిసే జరుగుతాయన్న విషయం ఆయనకు తెలియదా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

మేము రాగానే పేదలకు రేషన్ కార్డులిచ్చాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. తమ హాయాంలో జరిగిన​అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. బీఆర్ఎస్ హాయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇచ్చామని ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు.

నవీన్ యాదవ్ మరొక పీజేఆర్ కాబోతున్నారు : మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్

పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి జూబ్లీహిల్స్​లో చేసిన అభివృద్ధి ఏంలేదని మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్​అన్నారు. తాము ప్రచారంలోకి వెళ్తే అక్కడి ప్రజలు కూడా బీఆర్ఎస్ ఏమి చేయలేదని అంటున్నారన్నారని ఆయన తెలిపారు. నవీన్​యాదవ్​ గెలిస్తే నగరంలో మరో పీజేఆర్​లాగా పేద ప్రజలకు అండగా ఉంటారన్నారు.

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కి లేదు : మంత్రి జూపల్లి కృష్ణారావు

జూబ్లిహిల్స్ లో మూడు సార్లు వాళ్ళ అభ్యర్థినే ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ది జరగలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కి లేదన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ది ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ : మంత్రి పొన్నం ప్రభాకర్

బీజేపీ, బీఆర్ఎస్ లు ఢిల్లీలో దోస్తీ చేసుకొని గల్లీలో కుస్తీలు పడుతున్నట్లుగా వ్యవహారిస్తున్నాయని, ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేసినందున బలహీన వర్గాల బిడ్డకు జూబ్లీహిల్స్ లో టికెట్ ఇచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.

సినీ కార్మికుల సమస్యలపై అవగాహన ఉండి వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉండే వ్యక్తి నవీన్ యాదవ్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ నియోజవర్గంలోనే జూబ్లీహిల్స్ ఉందని, వారికి 10 వేలలోపే ఓట్లు వస్తాయని పొన్నం విమర్శించారు.

మాగంటి గోపినాథ్ మాతృమూర్తి ఆవేదనకు కేటీఆర్ జవాబు చెప్పాలి : టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్

మాగంటి గోపినాథ్ మాతృమూర్తి ఆవేదనకు కేటీఆర్ జవాబు చెప్పాలని, మాగంటి గోపినాథ్ కుమారుడికి సంధించిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని మహేష్​కుమార్​గౌడ్​డిమాండ్ చేశారు. ఇతర కుటుంబాల్లో తలదూర్చే ఆలోచన చేసే కాంగ్రెస్ కి లేదని, అంత్యక్రియల్లో పాల్గొనకూడదని మాగంటి కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పారని ఆయన ప్రశ్నించారు. నవీన్ యాదవ్ మీద ఒక్క కేసు హరీష్ రావు చూపిస్తే దేనికైనా సిద్ధమే అని మహేష్​కుమార్​గౌడ్​సవాల్ విసిరారు.

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించబోతున్నారని, ఆయన 30 వేల నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారన్నారు. కొన్ని చానల్స్ తో ఫేక్ సర్వేలు చేయించుకొని బీఆర్ఎస్ కుట్రలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ అరాచక పాలనకు... రెండేళ్ల తమ అభివృద్ధి పాలనకు బేరీజు వేసుకొని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని మహేష్​కుమార్​గౌడ్ స్పష్టం చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పాయికారి గుట్టు జూబ్లీ హిల్స్ లోనూ నడుస్తుందని, కిషన్ రెడ్డి, కేసీఆర్ మైత్రి తెలియంది కాదన్నారు. బీఆర్ఎస్ నేతలు పొర్లు దండాలు పెట్టిన గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే అని మహేష్​కుమార్​గౌడ్ తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఫేక్ వీడియో లు ప్రచారం చేస్తున్నారని, కారుకు ఓటు వేస్తే కమలానికి ఓటు వేసినట్లే అని విమర్శించారు.

Next Story