Jubilee Hills: 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ కౌంటింగ్.. వివరాలు వెల్లడించిన ఆర్‌వీ కర్ణన్

by Prasad Jukanti |   (  Updated:2025-11-13 09:45:53  IST  )

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయని జిల్లా ఎన్నికల అధికారి ఆర్‍వీ కర్ణన్ తెలిపారు.

Jubilee Hills: 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ కౌంటింగ్..  వివరాలు వెల్లడించిన ఆర్‌వీ కర్ణన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) ఓట్ల లెక్కింపు (Votes Counting) రేపు యూసఫ్‍గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ (RV Karnan) తెలిపారు. తొలుత బ్యాలెట్ ఓట్లు లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన..10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని సాధారణంగా ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటే ఇక్కడ స్పెషల్ పర్మిషన్ తో ఈసారి 42 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 1,94,631 (48.49శాతం) ఓట్లు పోలయ్యాయని 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.

కౌంటింగ్ ప్రక్రియలో 186 మంది సిబ్బంది పని చేస్తారని అందులో కౌంటింగ్ సూపర్‍వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‍తో పాటు ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారని తెలిపారు. కౌంటింగ్‍ను ఎప్పటికప్పుడు ఆర్వో పరిశీలిస్తారని వెల్లడిచారు.కౌంటింగ్ కేంద్రానికి అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప మిగతా వారికి అనుమతి తేలదని తెలిపారు. ఫలితాలను ఈసీ వెబ్ సైట్ https://results.eci.gov.in/లో ఎప్పటికప్పుడు అప్‍డేట్ చేస్తామని, మీడియా కోసం ఫలితాలను కౌంటింగ్ కేంద్రం వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశామన్నారు. ‍ఎన్నికల కౌంటింగ్‍కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్పెషల్ అధికారిని నియమించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జాయింట్ సీపీ ఇక్బాల్ మాట్లాడుతూ.. రేపటి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story