ముంచుకొస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్.. ఇంకా అభ్యర్థులను ప్రకటించని BJP, కాంగ్రెస్

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్నది.

ముంచుకొస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్.. ఇంకా అభ్యర్థులను ప్రకటించని BJP, కాంగ్రెస్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్నది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారమే షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలు కాగా.. అభ్యర్థుల ప్రకటన విషయంలో పార్టీలు ఆచితూచి అడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా మాగంటి సునీతను ముందుగానే ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలు గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టాయి. ఎన్నికల బరిలోకి దిగేందుకు ఈ రెండు పార్టీల నుంచి పలువురు ఆసక్తి చూపుతుండగా.. అభ్యర్థుల అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వీలైనంత త్వరగా రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. గెలుపే లక్ష్యంగా పార్టీలన్ని వ్యూహాలు పన్నుతుండడంతో నవంబర్ 11న జరిగే ఎన్నికల్లో రసవత్తరమైన పోరు జరుగనుంది.

నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్..?

అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నవీన్ యాదవ్‌తో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు తమవంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఆశావహులను సీఎం రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడారని, పార్టీ తప్పకుండా మీకు సముచితమైన గౌరవాన్ని ఇస్తుందని, పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపునకు సహకరించాలని నచ్చచెప్పడంతో వారు పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో స్థానిక కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయ్యిందనే టాక్ పార్టీ వర్గాల్లో వినబడుతోంది. బుధ, గురువారాల్లో అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

వెనుకబడిన బీజేపీ..

జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన విషయంలో బీజేపీలో ఏకాభిప్రాయం కుదరడం లేదనే టాక్ వినబడుతున్నది. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఎంపిక విషయంలో ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అశావహుల్లో వడపోత కార్యక్రమం మొదలు పెట్టి ముగ్గురి పేర్లను పార్టీ జాతీయ నాయకత్వానికి పంపినట్లు తెలిసింది. 2023 ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డితో పాటు మరో ఇద్దరు మహిళా నాయకురాళ్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ మాత్రం దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు పార్టీ నాయకుల్లో ప్రచారం జరుగుతున్నది. మరి కొన్ని గంటల్లో సస్పెన్స్‌కు తెరపడే అవకాశాలు కనబడుతున్నాయి.

Next Story