ఊపందుకోనున్న జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం.. రంగంలోకి దిగనున్న బడా లీడర్లు

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్​ ఉపఎన్నిక ప్రచారం నేటి నుంచి మరింత వేడెక్కనున్నది.

ఊపందుకోనున్న జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం.. రంగంలోకి దిగనున్న బడా లీడర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్​ ఉపఎన్నిక ప్రచారం నేటి నుంచి మరింత వేడెక్కనున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్​ పార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ ​అభ్యర్థి నవీన్​యాదవ్​ తరఫున కాంగ్రెస్ ​మంత్రులు డివిజన్ల వారీగా ప్రచారం చేస్తున్నారు.డివిజన్‌కు ఇద్దరు చొప్పున మంత్రులు బూత్‌ల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. ఇక నేటి(శుక్రవారం) నుంచి రేవంత్​రెడ్డి జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయనున్నారు. ఇటీవలే సీఎం యూసుఫ్​గూడలో సినీ కార్మికుల సభను ఏర్పాటు చేశారు. ఇక బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ సైతం నేటి నుంచి 10 రోజుల పాటు జూబ్లీహిల్స్​నియోజకవర్గంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. మూడు ప్రధాన పార్టీల అగ్రనేతలు, ముఖ్య నేతలు కూడా నేటి నుంచి తమ ప్రచార స్పీడ్‌ను పెంచనున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. బీజేపీ చీఫ్​రాంచందర్​రావు, బీజేపీ ముఖ్య నేతలు ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో ప్రచారంలో దూసుకుపోతున్నారు.

సీఎం రేవంత్ రోడ్ షో విజయవంతం చేయాలి : మంత్రులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి నేడు వెంగళరావు నగర్, సోమాజిగూడలో జరిగే ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. సీఎం పాల్గొనే సభ, రోడ్‌షోను విజయవంతం చేయడానికి వెంగళరావు నగర్ డివిజన్ ఇన్‌చార్జి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, వాకిటి శ్రీహరిలు జన సమీకరణపై పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. డివిజన్​నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులను సభకు తరలించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రూట్ మ్యాప్ ఎక్కడెక్కడ సభలు ఏర్పాటు చేయాలో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా రూట్‌మ్యాప్, భద్రతా సిబ్బందితో పూర్తిగా సమన్వయం చేసుకుని సభాస్థలం దగ్గర, రోడ్‌షో మార్గంలో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని మంత్రులు దిశానిర్దేశం చేశారు.

మూడు దశలుగా సీఎం ప్రచార సభలు..

నేడు వెంగళరావు నగర్, సోమాజిగూడలో ఎన్నికల సభల్లో పాల్గొనే సీఎం రేవంత్.. వచ్చేనెల 1న బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో జరిగే సభల్లో పాల్గొననున్నారు. వచ్చేనెల 4న షేక్‌పేట్-1​, రహ్మాత్​నగర్‌లలో జరిగే ప్రచార సభల్లోనూ పాల్గొననున్నారు. వచ్చేనెల 5న షేక్‌పేట-2, యూసుఫ్​గూడ.. వచ్చేనెల 8న ఆరు డివిజన్లలో కొనసాగే మోటార్​బైక్‌ల ర్యాలీలో సీఎం రేవంత్​పాల్గొంటారు. ఇక వచ్చేనెల 9న షేక్‌‌పేట్‌లో మోటార్​బైక్‌ల ర్యాలీలో సీఎం పాల్గొంటారు.

కేటీఆర్ రోడ్ షోలు

బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ జూబ్లీహిల్స్‌లో నేటి నుంచి వరుస రోడ్ షోలు నిర్వహించనున్నారు. నేటి నుంచి నవంబర్ 9 వరకు నియోజకవర్గంలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ 10 రోజుల పాటు బైపోల్స్‌లో కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. నేడు షేక్‌పేట్, నవంబర్ 1న రెహమత్ నగర్, 2న యూసుఫ్‌గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్, 6న ఎర్రగడ్డ డివిజన్లలో వరుసగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. అనంతరం, నవంబర్ 8న షేక్‌పేట్, యూసుఫ్‌గూడ, రెహమత్ నగర్ డివిజన్లలో రోడ్ షో కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రచారం నవంబర్ 9న షేక్‌పేట్ నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీతో ముగియనున్నది.

పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో కిషన్‌రెడ్డి

తన పార్లమెంట్​పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్​ఉపఎన్నికను కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ అభ్యర్థి లంకల దీపక్​రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను చుట్టి వచ్చే విధంగా ఆయన ప్రచారం సాగిస్తున్నారు. ఆయన తన ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలతో మాట్లాడుతున్నారు. తాము పెద్ద పెద్ద సభలు, ర్యాలీలు పెట్టొద్దని నిర్ణయించుకున్నామని అందుకే పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల దగ్గరకు వెళ్తున్నామన్నారు. బీజేపీ నేతలు ప్రధానంగా కాంగ్రెస్‌తో పాటు మజ్లీస్ పార్టీ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు.

Next Story