- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: కొత్త జీవోతో జర్నలిస్టులకు నష్టం లేదు: ప్రెస్ అకాడమీ
TG: కొత్త జీవోతో జర్నలిస్టులకు నష్టం లేదు: ప్రెస్ అకాడమీ

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం చేయవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎలాంటి వివక్షత లేకుండా సంక్షేమ చర్యలు అందరికీ వర్తించడంతోపాటు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి యోచిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఉర్దూ జర్నలిస్టులపై అనుసరించిన వివక్షతను, చిన్న పత్రికలపై చూపిన చిన్నచూపును, తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన అంశాల నేపథ్యంలో ఈ కొత్త జీఓలో మార్పులు తెచ్చినట్లు వెల్లడించారు. నూతన జీఓపై కొందరు ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను వెల్లడిస్తున్నారని తెలిపారు. సంక్షేమ చర్యలు విలేకరులకు మాత్రమే వర్తిస్తాయని వక్రీకరిస్తున్నారని.. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఇవి వర్తిస్తాయని వెల్లడించారు. ఈ విషయాలపై అవసరమైతే వివరణ కోరవచ్చని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై సీఎంతోపాటు సమాచార శాఖ మంత్రితో ఎప్పుడైనా మాట్లాడొచ్చని తెలిపారు. కానీ.. అందుకు విరుద్ధంగా రాజకీయ ఎత్తుగడతో కొన్ని శక్తులు ఆందోళన చేయాలని తలపెట్టడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. జర్నలిస్టులు, వారి సమస్యలపై సీఎం నాయకత్వాన ఉన్న ప్రజాప్రభుత్వం సానుకూల పరిష్కారానికి వెళ్తుంది తప్పా, గత ప్రభుత్వం మాదిరిగా వివక్షత చూపే అవకాశమే లేదని తెలిపారు. నూతన జీవోపై పనిగట్టుకొని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని విశ్వసించరాదని విజ్ఞప్తి చేశారు.






