- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: రెండు కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టుల నడుమ చిచ్చు
TG: రెండు కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టుల నడుమ చిచ్చు

దిశ, తెలంగాణ బ్యూరో: డెస్క్ జర్నలిస్టుల మీద ఎందుకు వివక్ష అని.. రెండు కార్డుల సిద్ధాంతంతో జర్నలిస్టుల నడుమ చిచ్చు పెట్టాలని చూస్తే సహించేది లేదని టీయూడబ్ల్యూజే (143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ హెచ్చరించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు కనీస గుర్తింపును కూడా రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. జర్నలిస్టుల హక్కులను కాపాడుకోవడానికి మరో పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. లోపభూయిష్టమైన జీవో 252ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 239ను రద్దు చేయడం తెలంగాణ జర్నలిస్టుల హక్కులను కాలరాయడమేనని అన్నారు. డెస్క్ జర్నలిస్టులను అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి పగబట్టడం అన్యాయమన్నారు. 23 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానిదేనని చెప్పారు. నాడు కల్చరల్ రిపోర్టర్లకు, స్పోర్ట్స్ రిపోర్టర్లకు, ఇలా ప్రతి విభాగానికి విడివిడిగా అక్రెడేషన్లు జారీ చేశామని.. ఇప్పుడు అవన్నీ రద్దు చేయడం దుర్మార్గమన్నారు.
వార్తా సేకరణలో ఫీల్డ్ జర్నలిస్టులది ఎంతటి కీలక పాత్రనో.. వార్తను తీర్చిదిద్దడంలో డెస్క్ జర్నలిస్టులది అంతే పాత్ర అని అభిప్రాయపడ్డారు. వారి అక్రెడిటేషన్లు రద్దు చేయడం అంటే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనన్నారు. వారిని రెండో శ్రేణి పౌరులుగా చూస్తూ మీడియా కార్డు పేరుతో వాళ్ల హక్కును రద్దు చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అలాగే.. పెద్ద పత్రికలకు, పెద్ద చానళ్ల జర్నలిస్టులకు గుర్తింపు కార్డులను కోత విధించడం సరికాదన్నారు. జర్నలిస్టుల అందరి హక్కుల కోసం టీయూడబ్ల్యూజే పోరాడడానికి ఎల్లవేళలా ముందంజలో ఉంటుందని స్పష్టం చేశారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు చేపడుతున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్, ఉపాధ్యక్షుడు రమేశ్‌హజారి, కోశాధికారి యోగానంద్, తేంజు ప్రధాన కార్యదర్శి రమణకుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గసభ్యులు అవ్వారి భాస్కర్, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి నవీన్‌కుమార్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.మల్లేశ్, సుదర్శన్‌రెడ్డి, కోశాధికారి బాపూరావు తదితరులు పాల్గొన్నారు.






