చైనా మాంజాపై ఉక్కుపాదం.. ఇకపై పోలీస్-అటవీ శాఖల సంయుక్త దాడులు.. ఆయా శాఖల అధికారుల సమీక్ష

by Ramesh Naini |

చైనా మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మడానికి, కొనడానికి వీలు లేకుండా పూర్తిస్థాయిలో అరికట్టాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు.

చైనా మాంజాపై ఉక్కుపాదం.. ఇకపై పోలీస్-అటవీ శాఖల సంయుక్త దాడులు.. ఆయా శాఖల అధికారుల సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: చైనా మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మడానికి, కొనడానికి వీలు లేకుండా పూర్తిస్థాయిలో అరికట్టాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. చైనా మాంజా వల్ల మనుషులకు, పక్షులకు, వన్యప్రాణులకు తీవ్ర ప్రమాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటవీ దళాల ప్రధాన సంరక్షిణాధికారిణి (పీసీసీఎఫ్- హెచ్‌ఓఎఫ్) డాక్టర్ సి. సువర్ణ అధ్యక్షతన అరణ్యభవన్‌లో వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైనా మాంజా తయారీ, సరఫరా, విక్రయాలపై జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను గుర్తించి, వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ సి. సువర్ణ మాట్లాడుతూ, నైలాన్, సింథటిక్ వంటి ప్రమాదకర దారాలు ఏ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి దిగుమతి అవుతున్నాయో స్పష్టంగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అహ్మదాబాద్, మంగళూరు, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి చైనా మాంజా సరఫరా జరుగుతున్నట్లు అధికారులు వివరించగా, ఆయా రాష్ట్రాల అటవీ శాఖల ప్రధాన సంరక్షిణాధికారులకు (పీసీసీఎఫ్‌లు) లేఖలు రాసి సమన్వయం చేస్తానని ఆమె తెలిపారు.

సినిమా నటుల చేత అవగాహన కార్యక్రమాలు

చైనా మాంజా వినియోగం వల్ల ప్రతి ఏడాది అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు, పిల్లలు, పక్షులు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. టూరిజం శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తదితర శాఖలు చైనా మాంజా ప్రమాదాలపై హెచ్చరిక బోర్డులు, అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, సినీ పరిశ్రమ నుంచి కూడా సహకారం తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు ప్రయత్నించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజును సంప్రదించారని, ఈ అంశంపై ఆయన సానుకూలంగా స్పందించి సంక్రాంతికి విడుదలయ్యే సినిమా నటుల చేత ప్రత్యేకించి అగ్ర నటీ నటుల చేత అవగాహన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు డాక్టర్ సువర్ణ తెలిపారు.

పోలీసు శాఖతో సమన్వయం

చైనా మాంజాను విక్రయించే దుకాణాలు, గోదాములు, అక్రమ నిల్వలపై పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించిన షాప్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. అవసరమైతే కేసులు నమోదు చేసి, అక్రమంగా నిల్వ ఉన్న చైనా మాంజాను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఐ అండ్ పీఆర్, బయోడైవర్సిటీ బోర్డు, ట్రాన్స్‌పోర్ట్, ఎండోమెంట్, పోలీస్ శాఖతో పాటు ఇతర సంబంధిత విభాగాల అధికారులు పాల్గొని, తమ శాఖల పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. చైనా మాంజా వల్ల జరిగే ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పీసీసీఎఫ్ డాక్టర్ సి. సువర్ణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story