John Wesley: నేటికీ దిక్సూచిలా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో

by Gantepaka Srikanth |

సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటానికి, ప్రపంచ ప్రజల విముక్తికి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో నేటికీ దిక్సూచిలా నిలుస్తోందని, సోషలిజమే ప్రపంచానికి ఏకైక మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు.

John Wesley: నేటికీ దిక్సూచిలా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో
X

దిశ, తెలంగాణ బ్యూరో: సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటానికి, ప్రపంచ ప్రజల విముక్తికి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో నేటికీ దిక్సూచిలా నిలుస్తోందని, సోషలిజమే ప్రపంచానికి ఏకైక మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. రెడ్ బుక్ స్పూర్తితో అమెరికా సామ్రాజ్యవాద కుట్రలను తిప్పికొడతామని అన్నారు. 1848 ఫిబ్రవరి 21న కార్ల్ మార్క్స్, ఫ్రైడ్రిచ్ ఏంగెల్స్ రచించిన అజరామర గ్రంథం ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’ ప్రచురితమైన రోజును పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘రెడ్ బుక్ డే’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ రాష్ట్ర కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ, సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటానికి, ప్రపంచ ప్రజల విముక్తికి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో నేటికీ దిక్సూచిలా నిలుస్తోందని, సోషలిజమే ప్రపంచానికి ఏకైక మార్గమని పేర్కొన్నారు.

ఆర్థిక ఆంక్షలు..

వెనిజులా తన చమురు సంపదను కార్పొరేట్లకు అప్పగించకుండా, జాతీయం చేసి ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తుండటంతో అమెరికా చమురు క్షేత్రాల స్వాధీనానికి పాల్పడుతోందని విమర్శించారు. ‘ఆర్థిక ఆంక్షలు’ అనే ఆయుధంతో వివిధ దేశాల ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. తన ఆయుధ వ్యాపారాన్ని పెంచుకోవడానికి, డాలర్ విలువను కాపాడుకోవడానికి అమెరికా మధ్యప్రాచ్య దేశాల్లో అశాంతిని రేపుతోందని, అణ్వాయుధాల పేరుతో ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడికి సిద్ధమవ్వడం అంతర్జాతీయ శాంతికి విఘాతమని హెచ్చరించారు. గతంలో లాగా అమెరికా చెప్పిందే వేదం అన్నట్లుగా ఇప్పుడు ప్రపంచం లేదని, రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది చిన్న దేశాల స్వతంత్రతకు శుభపరిణామమని తెలిపారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టిన ఘన చరిత్ర కలిగిన భారతదేశం, నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో అమెరికాకు ఒక జూనియర్ పార్ట్నర్ గా మారిపోవడం సిగ్గుచేటని విమర్శించారు. విదేశాంగ విధానం స్వయంప్రతిపత్తిని కోల్పోవడం వల్ల దేశ ప్రతిష్ట మసకబారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ‘రెడ్ బుక్ డే’ సందర్భంగా ప్రతి ఒక్కరూ అభ్యుదయ సాహిత్య పఠనం ద్వారా చైతన్యాన్ని పెంపొందించుకోవాలని, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న అంతర్జాతీయ పోరాటాలకు మద్దతు తెలపాలని జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి, టి.సాగర్, ఎండీ అబ్బాస్, రాష్ట్ర కేంద్రంలోని ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story