తెలంగాణను అవమానించేలా మాట్లాడితే సమర్థిస్తావా?.. రాంచందర్ రావుపై జాన్‌వెస్లీ ఫైర్

by Gantepaka Srikanth |

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, భారత దేశ విభజనతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు.

తెలంగాణను అవమానించేలా మాట్లాడితే సమర్థిస్తావా?.. రాంచందర్ రావుపై జాన్‌వెస్లీ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, భారత దేశ విభజనతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని, పాకిస్తాన్‌ను విడగొట్టిన పద్ధతిలోనే ఆంధ్రా-తెలంగాణ విభజన జరిగిందని తేజస్వీ సూర్య మాట్లాడటం ఆయన అజ్ఞానానికి, తెలుగు ప్రజల పట్ల ఉన్న చులకన భావానికి నిదర్శనమని, దశాబ్దాల పోరాటాలు, వందలాది మంది బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను ఒక దేశ విభజన నాటి రక్తపాతంతో పోల్చడం అత్యంత హేయమని అన్నారు. ఒకవైపు తామే తెలంగాణ ఇచ్చామని, ఇక్కడ ‘విమోచన దినోత్సవాలు’ జరుపుకుంటామని చెప్పుకునే బీజేపీ నాయకులు పార్లమెంటులో మాత్రం రాష్ట్ర ఏర్పాటును అవమానపరిచేలా మాట్లాడటం వారి రెండు నాలుకల ధోరణికి నిదర్శనమని, నాడు బిల్లుకు మద్దతు పలికిన వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్ వంటి నేతల నిర్ణయాలను ఇప్పుడు తేజస్వీ సూర్య తప్పుబడుతున్నారా? అని ప్రశ్నించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు, దక్షిణాది రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడకుండా.. ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ద్వారా చర్చను పక్కదారి పట్టించాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు తమ పార్టీ ఎంపీ రాష్ట్రాన్ని అవమానిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తెలుగు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Next Story