Viral: టమాట తోటలో ఉద్యోగాల కోసం అప్లికేషన్లు.. నెలకి రూ.12 వేల జీతంతో పాటు బోనస్ కూడా..

by Prasad Jukanti |   (  Updated:2026-07-09 06:50:02  IST  )

టమాటో తోటలో పనికి నెలకు ₹12,000 జీతం, ఉచితంగా టీ, కూల్ డ్రింక్స్ ఇస్తానంటూ ఓ మహిళా రైతు చేసిన జాబ్ ఆఫర్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: టమాట తోటలో ఉద్యోగాల కోసం అప్లికేషన్లు.. నెలకి రూ.12 వేల జీతంతో పాటు బోనస్ కూడా..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగం అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలోనో, పెద్ద పెద్ద ఆఫీసుల్లోనో పని చేయడం అనుకుంటున్న ఈ కాలంలో వ్యవసాయంలోనూ కార్పొరేట్ రేంజ్ ఆఫర్లతో అదరగొట్టవచ్చని నిరూపిస్తోంది ఓ మహిళా రైతు. తన టమాట తోటలో పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆమె చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఆకర్షణీయమైన జీతంతో పాటు వేడి వేడిగా టీ లు, చల్లగా కూల్ డ్రిక్స్ ఉచితంగా ఇస్తామని బోనస్‍గా తోటలో పండిన కూరగాయలు సైతం ఇస్తానని ఆమె ప్రకటించారు. మహిళా రైతు చేస్తున్న ఈ జాబ్ ఆఫర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నెల రోజుల పాటు ట్రైనింగ్:

టమాట తోట ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,000 జీతం ఇస్తామని సదరు మహిళా రైతు ప్రకటించారు. పని వేళలు కూడా చాలా అనుకూలంగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఉంటాయని వెల్లడించారు. ఇక ఉద్యోగుల సౌకర్యార్థం ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే వేడి వేడి టీ, ఎండ తీవ్రతను తట్టుకునేందుకు మధ్యాహ్నం 12 గంటలకు చల్లని కూల్ డ్రింక్ ఉచితంగా ఇస్తామని క్రేజీ ఆఫర్ ప్రకటించారు. అలాగే తోటలో చేరగానే నేరుగా పనిలోకి తీసుకోకుండా టమాట మొక్కలు ఎలా నాటాలి? వాటికి పురి (తాడు) ఎలా కట్టాలి? కాయలు ఎలా కోయాలి? అనే విషయాలపై మొదటి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని ప్రకటించారు. ట్రైనింగ్ లేకపోతే అనుభవం లేక చెట్ల కొమ్మలు విరగ్గొడతారు, పచ్చికాయలు కోసేస్తారు. అందుకే ఈ ట్రైనింగ్ ఇవ్వబోతున్నామని వీడియోలో స్పష్టం చేశారు.

బోనస్‌గా కూరగాయలు.. బావమ్మ గ్రాండ్ డిన్నర్:

కేవలం జీతం మాత్రమే కాకుండా, తోటలో పండే తాజా కూరగాయలు, మామిడికాయలు, ఆకుకూరలను కూడా ఉద్యోగులకు ఉచితంగా ఇస్తామని సదరు మహిళా రైతు పేర్కొన్నారు. ఇవన్నీ ఒకెత్తయితే, వచ్చే ఆదివారం తమ బావమ్మ చేతి వంటతో చికెన్, పూరి, రాగి సంగటితో కూడిన 'గ్రాండ్ డిన్నర్' ఇస్తున్నామని.. తన ఫాలోవర్స్ అందరూ ఈ విందుకు రావచ్చని ఆహ్వానం పలికారు. ఇలాంటి అద్భుతమైన ఉద్యోగ అవకాశం మళ్లీ రాదు.. వెంటనే లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేయండి అంటూ ఆమె ముగించిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూన్నారు. సదరు మహిళ తనకు వ్యూస్, షెరింగ్స్ పెంచుకునేందుకే ఇలా వీడియో తీసిందని కొందరు కామెంట్స్ చేస్తుంటే సరదాగా చేసినా వ్యవసాయానికి ఓ కార్పొరేట్ లుక్ ఇచ్చిందంటూ మరికొందరు ఆమె వీడియోను ప్రశంసిస్తున్నారు.

Next Story