3 వేల మందికి ఉద్యోగావకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు

by Gantepaka Srikanth |

ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల సాంకేతిక సహకారంతో మరో రెండు నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

3 వేల మందికి ఉద్యోగావకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల సాంకేతిక సహకారంతో మరో రెండు నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. సోమవారం ఆయన కోవాసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్న ఇంజినీర్లు, చదువులు పూర్తిచేస్తున్న విద్యార్థులకు దీని ద్వారా నూతన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం 500 మంది ఇంజినీర్లు పనిచేస్తున్న కోవాసెంట్ మరో రెండేళ్లలో 3,000 మంది ప్రతిభావంతులను ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ఏఐ సాంకేతిక దూకుడుతో కోడింగ్‌లో ఉన్నవారు ఇతర ప్లాట్ ఫారాల్లో పనిచేస్తున్న వారు నైపుణ్యాలను పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. వారందరికీ ఏఐ యూనివర్సిటీ ద్వారా రీస్కిల్, అప్ స్కిల్స్ అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కోవాసెంట్ చైర్మన్ సీవీ సుబ్రమణ్యంను ప్రత్యేకంగా ప్రశంసించారు. 18 మంది ఉద్యోగులతో దశాబ్దాల క్రితం సిగ్నిటీ పేరుతో సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించిన ఆయన ఇవ్వాళ వేల మంది సిబ్బందితో ప్రపంచస్థాయి సంస్థగా కోవాసెంట్ ను తీర్చిదిద్దారని చెప్పారు.

టెక్నాలజీ అంటే సిలికాన్ వ్యాలీ, ప్రపంచ ప్రొడక్షన్ సెంటర్‌గా చైనాలోని షెంజెన్, క్రమశిక్షణ, సుపరిపాలన కలిగిన దేశంగా సింగపూర్‌ల గురించి చెబుతారని, ఈ మూడు లక్షణాలు కలగలిసిన నగరంగా హైదరాబాద్ రూపొందుతున్నదని తెలిపారు. ఇక్కడ ఉన్న అనుకూల పర్యావరణం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో గ్లోబల్ సామర్థ్య కేంద్రాలున్న నగరంగా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయని, ఇది అత్యంత గర్వించదగ్గ అంశమని తెలిపారు. లైఫ్ సెన్సెస్ రంగంలో గణనీయ ప్రగతిని సాధించామని.. దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే తయారవుతున్నాయని చెప్పారు. హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయని.. ఇటువంటి ఎకోసిస్టం మరెక్కడా కనిపించదని తెలిపారు. సమావేశంలో కోవాసెంట్ చైర్మన్ సుబ్రమణ్యం, ఐటీ, ఇండస్ట్రీస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, యూకే డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ వయన్ ఓవేన్ పాల్గొన్నారు.

Next Story