జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి: నిరుద్యోగ జేఏసీకి సీపీఎం భరోసా

by Ramesh Naini |

తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఉన్న ఖాళీల‌న్నింటినీ వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.

జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి: నిరుద్యోగ జేఏసీకి సీపీఎం భరోసా
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఉన్న ఖాళీల‌న్నింటినీ వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేర‌కు జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాల‌నీ, నోటిఫికేష‌న్ల‌ను జారీ చేయాల‌ని కోరారు. రానున్న కాలంలో నిరుద్యోగ జేఏసీ చేసే పోరాటానికి అన్ని విధాలా మ‌ద్ద‌తిస్తామ‌నీ, వారి పోరాటాల్లోనూ ప్ర‌త్య‌క్షంగా పాల్గొంటామ‌ని ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాల‌యంలో నిర్వహించిన మీడియా స‌మావేశంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆనగంటి వెంక‌టేశ్‌, కార్య‌ద‌ర్శి కోట ర‌మేశ్‌, నిరుద్యోగ జేఏసీ క‌న్వీన‌ర్ ఆర్‌ఎల్‌.మూర్తి, జేఏసీ నాయ‌కులు కిర‌ణ్‌, శ్రీ‌నులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 60 ల‌క్ష‌ల ఖాళీలున్నాయ‌నీ, ఒక్క రైల్వే శాఖ‌లోనే 10 ల‌క్ష‌ల ఖాళీలున్నాయ‌ని తెలిపారు. కార్పొరేట్ విధానాల పేరిట ప్ర‌భుత్వ రంగ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ అణ‌గారిన వ‌ర్గాల వారికి ఉద్యోగ అవ‌కాశాలు లేకుండా మోడీ స‌ర్కారు చేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. 2014లో ఇచ్చిన‌ రెండు కోట్ల ఉద్యోగాల భ‌ర్తీ హామీ ఏమైంద‌ని మోడీ స‌ర్కార్‌ను ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో తొలి ఏడాదే 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని హామీనిచ్చి నిరుద్యోగుల కుటుంబాల ఓట్ల‌తో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం 28 నెల‌ల పాల‌న‌లో కేవ‌లం 16,798 పోస్టుల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేసింద‌ని విమ‌ర్శించారు.

రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏమైంది?

రాహుల్ గాంధీ స్వ‌యంగా అశోక్ న‌గ‌ర్ చౌర‌స్తాకు వ‌చ్చి ఇచ్చిన హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. నిరుద్యోగుల స‌మ‌స్య‌, ఉద్యోగాల భ‌ర్తీ అంశంపై అసెంబ్లీ స‌మావేశాల్లో క‌నీసం చ‌ర్చ‌కు రాక‌పోవ‌డాన్ని బ‌ట్టే స‌మ‌స్య‌పై పాల‌కుల‌కు ఎంత చిత్త‌శుద్ధి ఉందో అర్థ‌మ‌వుతుంద‌న్నారు. అడ్డ‌గోలు జీవోల‌ను జారీ చేసి నిరుద్యోగుల‌ను గంద‌ర‌గోళ‌ప‌ర్చ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. కేంద్రం ప్ర‌భుత్వం స‌రిగా స్పందించ‌క‌పోవ‌డం ప‌ట్ల‌నే మ‌తం మారిన ద‌ళితుల‌కు రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తించ‌వ‌ని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింద‌న్నారు. మ‌తం మారినంత మాత్రాన కుల వివ‌క్ష పోతుందా..? అని ప్ర‌శ్నించారు. దేశంలో ఏ మ‌తాన్ని అయినా స్వీక‌రించే హ‌క్కును రాజ్యాంగం క‌ల్పించింద‌నీ, మ‌తం మారార‌నే కార‌ణంతో రిజ‌ర్వేష‌న్లు తొల‌గించ‌డం స‌హేతుకం కాద‌ని చెప్పారు. సుప్రీం కోర్టు ఆ తీర్పును పునఃస‌మీక్షించాల‌ని కోరారు. గాదె ఇన్న‌య్య అరెస్టును ఖండించిన సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి పోటురంగారావుపై ఉపా కింద నోటీసులు జారీ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. అక్ర‌మ కేసుల‌ను, నిర్బంధాల‌ను ప్ర‌శ్నించ‌డం ప్రాథ‌మిక హ‌క్కు అని చెప్పారు. పోటు రంగారావుపై ఉపా కేసును ఉప‌సంహ‌రించాల‌ని డిమాండ్ చేశారు. కేర‌ళ కంటే తెలంగాణ అన్నింటిలోనూ ముందంజ‌లో ఉంద‌ని ఆ రాష్ట్ర ఎన్నిక ప్ర‌చారానికి వెళ్లి సీఎం చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. కేర‌ళ‌లో విద్య‌, వైద్యం ఉచితంగా అందిస్తుంటే తెలంగాణ‌లో పూర్తిగా వ్యాపార‌మ‌యం అయింద‌నీ, కేర‌ళం ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, బ‌డుల్లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తుంటే మ‌న రాష్ట్ర ప్ర‌భుత్వం వాటిని కార్పొరేట్ల కోసం నిర్వీర్యం చేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. ఆరు గ్యారంటీల‌ను తెలంగాణ‌లో బాగా అమ‌లు చేస్తున్నామ‌ని కేర‌ళం వెళ్లి రేవంత్‌రెడ్డి చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

ఈ నెల 30న నిరుద్యోగ సదస్సు

ఈ నెల 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ సదస్సు నిర్వహించనున్నట్టు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆనగంటి వెంక‌టేశ్‌, రాష్ట్ర కార్య‌ద‌ర్శి కోట ర‌మేశ్‌, నిరుద్యోగ జేఏసీ క‌న్వీన‌ర్ ఆర్‌ఎల్‌.మూర్తి తెలిపారు. జూన్ రెండో తేదీ నాటికి జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసి ఖాళీల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌నీ, లేనిప‌క్షంలో ద‌శ‌ల‌వారీగా పోరాటాలు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. యూత్ డిక్ల‌రేష‌న్ ఏమైంద‌ని రేవంత్ రెడ్డి స‌ర్కారును ప్ర‌శ్నించారు. నిరుద్యోగ స‌మ‌స్య కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల‌కు ఒక రాజ‌కీయ అస్త్రంగా మారింద‌ని విమ‌ర్శించారు.

Next Story