- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JNTUలో వసూళ్ల జోరు..! అఫిలియేషన్ పేరిట రూ.లక్షలు డిమాండ్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే విషయంలో జేఎన్టీయూలోని కొందరు అధికారులు పెద్ద ఎత్తున మామూళ్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే విషయంలో జేఎన్టీయూలోని కొందరు అధికారులు పెద్ద ఎత్తున మామూళ్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒక్కో కాలేజీ నుంచి సగటున రూ.10 లక్షల వరకు డిమాండ్ చేసినట్లు టాక్. ఈ వ్యవహారం ప్రతి ఏటా జరిగే తంతు అనేది బహిరంగ రహస్యం. కానీ ఈసారి మాత్రం గతంలో కన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేసినట్లు డిస్కషన్ జరుగుతున్నది. ఈసారి ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లోని కీలక అధికారుల పేర్లు చెప్పి మరీ వసూలు చేసినట్లు సెక్రెటేరియట్‌లో జోరుగా చర్చ నడుస్తున్నది.
నామమాత్రంగా తనిఖీలు
అఫిలియేషన్ ఇచ్చేందుకు యూనివర్సిటీ కొందరు ప్రొఫెసర్లు, అధికారులతో కలిపి ఓ కమిటీ ఏర్పాటు చేస్తుంటుంది. ఆ కమిటీ ప్రతి కాలేజీకి వెళ్లి ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయాలి. నిబంధనల ప్రకారం కాలేజీలో అన్ని వసతులు ఉన్నాయా? క్లాస్ రూమ్స్ సరిగ్గా ఉన్నాయా? అన్ని కోర్సులకు ల్యాబ్స్ ఉన్నాయా? లేదా? అలాగే కోర్సులకు అనుగుణంగా టీచింగ్ స్టాఫ్ ఉందా? అనే కోణంలో పరిశీలించి రిపోర్టు ఇవ్వాలి. అప్పుడే వర్సిటీ సదరు కాలేజీలకు అఫిలియేషన్ ఇస్తుంది. కానీ కమిటీ మాత్రం అక్కడికి వెళ్లి తూతూ మంత్రంగా తనిఖీలు చేసి అన్ని రూల్స్ ప్రకారం ఉన్నట్టు రిపోర్టులు ఇస్తుందనే విమర్శలు ఉన్నాయి. కాలేజీలు ఇచ్చే అతిథి మర్యాదలు, మామూళ్ల కోసం అఫిలియేషన్ కమిటీలో చోటు కోసం అధికారులు, ప్రొఫెసర్లు పోటీలు పడుతుంటారని విమర్శలున్నాయి.
రూ.కోట్లలో వసూళ్ల దందా..
జేఎన్టీయూ పరిధిలో సుమారు 140 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇవి ప్రతీ అకడమిక్ ఇయర్ ప్రారంభంలో వర్సిటీ నుంచి ఆఫిలియేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అప్పుడే ఆ కాలేజీలకు కౌన్సెలింగ్ ద్వారా స్టూడెంట్స్ అడ్మిషన్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయా కాలేజీల్లో డిగ్రీ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్‌కు వర్సిటీ సర్టిఫికెట్స్ అందిస్తుంటుంది. అఫిలియేషన్ జారీకి కాలేజీ స్థాయిని బట్టి ఒక్కో కళాశాలకు ఒక్కో రేటు ఫిక్స్ చేసి పకడ్బందీగా వసూలు చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ధైర్యం చేసి అడిగినంత ఇవ్వకపోతే ఏదో ఒక కొర్రీలు వేసి సకాలంలో అఫిలియేషన్ ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. అందుకే కాలేజీలు ఆఫిలియేషన్ కమిటీలకు అడిగినంత సొమ్ము చెల్లించడానికి సిద్ధమై పోతుంటాయని సమాచారం. ఈ ఏడాది ఒక్కో కాలేజీ నుంచి సగటున రూ.10 లక్షల చొప్పున సుమారు రూ.12 నుంచి 15 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వసూళ్లు బహిరంగ రహస్యమే..
అఫిలియేషన్ ఇచ్చినందుకు వర్సిటీ అధికారులకు మామూళ్లు ఇవ్వడం సాధారణంగా మారింది. ఈ అంశంపై అటు వర్సిటీలో ఇటు కాలేజీల్లో అందరూ పబ్లిక్‌గానే మాట్లాడుకుంటున్నారు. ‘ఈ దందా కొత్తదేమీ కాదు. చాలా ఏండ్లుగా నడుస్తున్న బిజినెస్. ఇది అందరికీ తెలిసిన విషయం’ అంటూ ఎడుకేషన్ డిపార్ట్‌మెంట్ వర్గాలు చాలా సింపుల్‌గా కామెంట్ చేశాయి. ఎంత మొత్తంలో మామూళ్లు ఇవ్వాలో సదరు కాలేజీ యాజమాన్యాలకు ముందే సమాచారం ఇస్తారని, ఆ మేరకు కాలేజీలు సైతం కమిటీ మెంబర్లకు అతిథి మర్యాదలు (మందు పార్టీలు, డిన్నర్ పార్టీలు, కొన్ని కాలేజీలు గోవా ట్రిప్స్) ఇచ్చి కవర్లలో డబ్బులు పెట్టి సాగనంపుతారని చర్చ జరుగుతున్నది. ఆ డబ్బులను కాలేజీ యాజమాన్యాలు తమకు వచ్చే లాభాలను నుంచి ఇవ్వవు. స్టూడెంట్స్ నుంచి మిసిలెనియన్స్ ఫీజు రూపంలో రికవరీ చేసుకుంటాయని ఆరోపణలు ఉన్నాయి.
కీలక అధికారి మద్దతు!
ప్రతి ఏటా జరిగే వసూళ్ల దందాలో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లోని కీలక అధికారుల మద్దతు ఉంటుందని, అందుకే ఈ విషయంలో వారు చూసీచూడనట్టుగా ఉంటారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన వసూళ్ల దందాలో వర్సిటీ అధికారులు ఓ కీలక అధికారి పేరును దుర్వినియోగం చేసినట్టు తెలుస్తున్నది. సదరు ఆఫీసర్ తనకు చాలా క్లోజ్ అని చెప్పి మరింత ఎక్కువ మొత్తంలో మామూళ్లు వసూలు చేసినట్టు సమాచారం. కానీ, సదరు ఆఫీసర్‌పై అవినీతి మరకలు లేవు. అలాంటి ఆఫీసర్ పేరును అడ్డం పెట్టుకుని దందా చేశారనే చర్చ సచివాలయంలో జోరుగా సాగుతున్నది.






