JNTUH R22 గ్రేస్ మార్కుల వివాదం.. రేపు కూకట్‌పల్లి క్యాంపస్‌లో నిరసన పిలుపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-22 10:00:01  IST  )

JNTUH R22 బీటెక్ విద్యార్థులు తమకు 0.50 శాతం గ్రేస్ మార్కులు కలపాలని డిమాండ్ చేస్తున్నారు.

JNTUH R22 గ్రేస్ మార్కుల వివాదం.. రేపు కూకట్‌పల్లి క్యాంపస్‌లో నిరసన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUH) పరిధిలోని R22 రెగ్యులేషన్ విద్యార్థుల పట్ల జరుగుతున్న తీవ్ర అన్యాయంపై విద్యార్థాలు సమరశంఖం పూరించారు. తమకు కూడా 0.50 శాతం గ్రేస్ మార్కులు కేటాయించాలనే ప్రధాన డిమాండ్‌తో రేపు జేఎన్‌టీయూ కుకట్‌పల్లి క్యాంపస్ వద్ద భారీ నిరసన కార్యక్రమానికి (PROTEST) విద్యార్థులు పిలుపునిచ్చారు.గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన సమస్యను విశ్వవిద్యాలయ అధికారుల దృష్టికి, వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకువెళ్తున్నా ఫలితం లేకుండా పోతోందని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రత తెలిసి కూడా అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఇవే..

అయితే, గతంలో R18 బ్యాచ్ విద్యార్థులకు 0.50 శాతం గ్రేస్ మార్కులు ఇచ్చారని, అదే విధంగా తమకూ అమలు చేయాలని R22 విద్యార్థులు కోరుతున్నారు. రాబోయే R25 బ్యాచ్‌ వారికి 10 గ్రేస్ మార్కులతో పాటు సబ్జెక్ట్ ఎక్సెంప్షన్ (Subject Exemption) సౌకర్యం కల్పిస్తున్నప్పుడు, కేవలం R22 బ్యాచ్ పట్ల అధికారులు ఎందుకు వివక్ష చూపిస్తున్నారని విద్యార్థి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ 0.50 శాతం గ్రేస్ మార్కులు కనుక కలిపితే విశ్వవిద్యాలయ పరిధిలోని దాదాపు 20 వేల మందికి పైగా విద్యార్థులు అర్హత సాధించి ఉత్తీర్ణులవుతారు.

మరోవైపు R22 బ్యాచ్‌కు చెందిన అనేక మంది విద్యార్థులు ఇప్పటికే క్యాంపస్ ఇంటర్వ్యూలలో ప్రతిభ చూపి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కొందరికి కాల్ లెటర్స్, ఆఫర్ లెటర్స్ కూడా అందాయి. అయితే, గ్రేస్ మార్కులు కలపడంలో జాప్యం జరగడం వల్ల మెమోలు అందక, ఉద్యోగాల్లో చేరలేక వారి జీవితాలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విశ్వవిద్యాలయం ఛాన్సలర్ హోదాలో ఉన్న అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, వేలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే గ్రేస్ మార్కులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story