సీజేపీ ఆందోళనలో సీక్రెట్ యాప్స్!.. ఢిల్లీ పోలీసుల విచారణలో కీలక విషయాలు?

by Prasad Jukanti |   (  Updated:2026-07-22 11:04:22  IST  )

ఢిల్లీ చలో పార్లమెంట్ ఉద్రిక్తతపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు గుర్తించినట్లు తెలుస్తోంది.

సీజేపీ ఆందోళనలో సీక్రెట్ యాప్స్!.. ఢిల్లీ పోలీసుల విచారణలో కీలక విషయాలు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: చలో పార్లమెంట్ సందర్భంగా సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జి దేశరాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. విద్యార్థులపై పోలీసులు అమానుష దాడికి పాల్పడ్డారంటూ ఈ దాడికి నిరసనగా ప్రధాన పార్టీలు ఆందోళన బాట పట్టాయి. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ సీజేపీ ఆందోళనలు దేశరాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో మొన్నటి సీజేపీ ఆందోళనలు హింస, ఉద్రిక్తతకు దారితీయడంతో ఢిల్లీ పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 10 ఎఫ్ఐఆర్‍లు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

సీక్రెట్ యాప్ లతో చాటింగ్:

20 రోజులకు పైగా జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సీజేపీ విద్యార్థులు 'చలో సంసద్' మార్చ్ సందర్భంగా కమ్యూనికేషన్ కోసం సీక్రెట్ యాప్‍లను ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీయగా పోలీసులు వెనంటనే ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయినా విద్యార్థులు పెద్ద ఎత్తున పోగుకావడం వెనుక కమ్యూనికేషన్‌ కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చాటింగ్ చేసుకున్నారని అయితే ఈ చాటింగ్‍లలో నిరసన సందర్భంగా అవసరం అయితే ప్రాణాలర్పించేందుకు కూడా సిద్ధమేనంటూ ఉన్న సందేశాలతో కూడిన చాట్‌‍లను పోలీసులు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. బ్లూటూత్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేసే కొన్ని ప్రత్యేక యాప్‌ల ద్వారా గ్రూప్ సభ్యులు నిరంతరం టచ్‌లో ఉండాలని చాట్‌లలో సూచించినట్లు బయటపడింది. ఈ ఘటనలో 118 మంది పోలీసు సిబ్బంది, 70 మంది నిరసనకారులు గాయపడగా, 15 నుండి 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో ఇంటర్నెట్ జామర్లు ఏర్పాటు చేసినా బ్లూటూత్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేసే కొన్ని ప్రత్యేక యాప్‌ల ద్వారా గ్రూప్ సభ్యులు నిరంతరం టచ్‌లో ఉండాలని చాట్‌లలో సూచించినట్లు బయటపడింది. ఆ యాప్‌ల లింక్‌లను కూడా సదరు గ్రూపుల్లో షేర్ చేసినట్లు సమాచారం.

మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు:

వెలుగులోకి వచ్చిన చాటింగ్‍లలో తీవ్రస్థాయి రాజకీయ వ్యాఖ్యలు, ఉద్రిక్తత పెంచే పిలుపులు ఉన్నట్లు విచారణాధికారులు గుర్తించినట్లు సమాచారం. ఓ చాట్‍లో 'నిరసనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే, అది ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది" అని ఉండగా, మరొక చాట్‌లో ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయనే అర్థంలో సంభాషణలు సాగాయని అంతేకాకుండా 'మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు'అంటూ కూడా వ్యాఖ్యలు ఉన్నట్లు తెలుస్తోంది. సేకరించిన డిజిటల్ ఆధారాలు, చాట్‌ల యజమానులు, వాటి మూలాలను నిర్ధారించేందుకు సైబర్ నిపుణుల సాయంతో ఫోరెన్సిక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ విజువల్స్, మొబైల్ వీడియోలతో పాటు ఈ డిజిటల్ ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ సంభాషణలు కేవలం వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలా లేదా హింసను ప్రేరేపించడానికి చేసిన కుట్రలో భాగమా అనేది పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Next Story