‘సంసద్ చలో’ మార్చ్‌లో పోలీసుల బలప్రయోగం.. ఢిల్లీ హైకోర్టు సెన్సేషనల్ ఆర్డర్స్

by Kema Shiva Kumar |

'సంసద్ చలో' ప్రదర్శనలో విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు బలప్రయోగం చేశారన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.

‘సంసద్ చలో’ మార్చ్‌లో పోలీసుల బలప్రయోగం.. ఢిల్లీ హైకోర్టు సెన్సేషనల్ ఆర్డర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘సంసద్ చలో’ నిరసన ప్రదర్శనలో విద్యార్థులను ఢిల్లీ పోలీసులు ఇష్టానుసారంగా చేయిచేసుకున్నారని దాఖలైన పిల్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై పోలీసుల సమాధానాన్ని కోరుతూ.. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, రికార్డులను ఎస్‌ఓపీ (SOP) ప్రకారం భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది.

వాడీవేడిగా వాదనలు..

అయితే, పోలీసుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్‌వీ రాజు వాదిస్తూ.. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారని, ఆందోళన హింసాత్మకంగా మారడంతోనే వారు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అనేకమంది పోలీసులకు గాయాలయ్యాయని, ప్రభుత్వం వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ధ్వంసమయ్యాయని కోర్టుకు విన్నవించారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి తప్పుడు పిటిషన్లు దాఖలు చేశారని, నిజమైన ఫిర్యాదు ఉంటే బాధితులు సంబంధిత మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చని ఎస్‌రాజ్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు.

ధర్మాసనం రియాక్షన్ ఇదే..

వాదనల సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది ఏదో ఒక వ్యక్తిగత ఘటన కాదని, గుంపును చెదరగొట్టేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా పబ్లిక్ లా పరిధిలో బాధితులు ఊరట పొందవచ్చని స్పష్టం చేసింది. సీసీటీవీ దృశ్యాలను పూర్తిగా చూడకుండా తాము ఏ నిర్ణయానికీ రాలేమని, ఈ విషయంలో పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను నిరసన స్థలం నుంచి బలవంతంగా ఆస్పత్రి తరలించడంపై దాఖలైన పిటిషన్‌ను కూడా ఇదే పిటిషన్లతో కలిపి విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.

Next Story