విద్యార్థులపై లాఠీచార్జ్ బీజేపీ నియంతృత్వానికి నిదర్శనం

by Ratna Kumari |

ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని సీపీఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి విమర్శించారు.

విద్యార్థులపై లాఠీచార్జ్ బీజేపీ నియంతృత్వానికి నిదర్శనం
X

దిశ, తల్లాడ : ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని సీపీఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి విమర్శించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌పై పోలీసుల బలప్రయోగాన్ని ఖండిస్తూ బుధవారం తల్లాడ మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శీలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, 2014 నుంచి బీజేపీ పాలనలో అనేక పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం వల్ల కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.

ఈ ఏడాది నీట్ పరీక్ష పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర అనిశ్చితికి గురయ్యారని, కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలపై స్పందిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరిన ప్రముఖ పర్యావరణవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థులు చేపట్టిన న్యాయమైన పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు చలమాల విట్టల్‌రావు, అయినాల రామలింగేశ్వరరావు, కొలికపోగు సర్వేశ్వరరావు, నల్లమోతు మోహన్‌రావు, చల్లా నాగేశ్వరరావు, సత్తెనపల్లి నరేష్, వేలాద్రి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Next Story