- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కాంగ్రెస్ పతనం మొదలైంది.. రేవంత్ పాలనపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ (ఏఐసీసీ) పట్టు కోల్పోయిందని జీవన్ రెడ్డి విమర్శించారు. "ఒకప్పుడు పీసీసీ (PCC) ఏది చెబితే ముఖ్యమంత్రులు అది చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే ఏకపక్షంగా 'రూలర్'లా వ్యవహరిస్తున్నారు" అని ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తుతం పీసీసీ అనేది కేవలం ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసే ఒక విభాగంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "పీసీసీ చేసే తప్పులకు చివరకు ఏఐసీసీ (AICC) ని నిందించడం సరికాదు. పార్టీ మాత్రమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తోంది" అని జీవన్ రెడ్డి విశ్లేషించారు.
కేసీఆర్ నాయకత్వం కావాలి...
తెలంగాణ ప్రజల నాడి మారుతోందని ఆయన పేర్కొన్నారు. "ప్రస్తుత పాలనతో విసిగిపోయిన ప్రజలు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారీ మార్పులు రావడం ఖాయం" అని ఆయన జోస్యం చెప్పారు. సీనియర్ నేతగా కాంగ్రెస్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న జీవన్ రెడ్డి, నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసీఆర్ భేటీ తర్వాత ఆయన పూర్తిగా బీఆర్ఎస్ గొంతుకగా మారినట్లు ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.






