- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాల సమస్యకు చెక్! ఏఐసీసీ నేతతో ముగిసిన జీవన్ రెడ్డి భేటీ
జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికకు ముందు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్గాల మధ్య తలెత్తిన విభేదాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ కార్యదర్శి సవాంత్‌తో సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జీవన్ రెడ్డి తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో:
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రమంతా ఒక పరిస్థితి ఉంటే జగిత్యాలలో మాత్రం మరో పరిస్థితి ఉంది. మిగతా చోట్ల మున్సిపల్ చైర్మన్ పోస్టును దక్కించుకునేందుకు మిగతా పార్టీలతో మంతనాలు సాగించాల్సిన పరిస్థితి ఉంటే జగిత్యాలలో మాత్రం సొంత నేతలతోనే బుజ్జగింపులకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్గాల మధ్య కుర్చీలాట కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని జిల్లా ఇన్‍చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఏఐసీసీ కార్యదర్శి సవాంత్‍కు అప్పగించారు. ఈ నేపథ్యంలో సవాంత్, మంత్రి అడ్లూరితో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది.
నా సూచనలు పరిగణలోకి తీసుకోండి :
ఈ సందర్భంగా సవాంత్‍తో జీవన్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఇచ్చిన 16 బీఫామ్ ల్లో 9 చోట్ల గెలిచామని అదే సంజయ్ కు 34 బీఫామ్ లు ఇస్తే 14 మాత్రమే గెలిచారని సవాంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. సంజయ్ పక్కన పెట్టిన 9 మంది ఇండిపెండెంట్లు కూడా గెలిచారని తన వర్గానికి బీ ఫామ్ లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నా ఆలోచనలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఈ సమావేసం అనంతరం మాట్లాడుతూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జీవన్ రెడ్డి చెప్పినట్లు మంత్రి అడ్లూరి వెల్లడించారు. జగిత్యాలపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. ఈ భేటీతో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమస్యకు చెక్ పడినట్లేననే టాక్ వినిపిస్తోంది. మరి రేపు చైర్ పర్సన్ ఎంపిక వేళ సజావుగానే సాగుతుందా లేక ఏదైనా ట్విస్ట్ ఉండబోతోందా అనేది వేచి చూడాలి.






