జీవన్‌ రెడ్డికి మళ్లీ మొండిచేయి.. సంజయ్ వర్గానికే చైర్ పర్సన్ పదవి

by Kema Shiva Kumar |

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎంపికలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదనలను కాదని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లను పక్కన పెట్టడంపై జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో, జిల్లా రాజకీయాల్లో వర్గపోరు ముదిరింది.

జీవన్‌ రెడ్డికి మళ్లీ మొండిచేయి.. సంజయ్ వర్గానికే చైర్ పర్సన్ పదవి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల (Jagityal) కాంగ్రెస్‌లో వర్గపోరు మొదలయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎంపిక వ్యవహారం కాక రేపుతోంది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రతిపాదనలను కాదని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. తాజాగా, జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా వాణి పేరును పార్టీ దాదాపు ఖరారు చేసింది. వాణి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన అనుచరురాలు కావడంతో జీవన్ రెడ్డి వర్గానికి పెద్ద షాక్‌గా మారింది. గత కొంతకాలంగా మున్సిపల్ పీఠంపై తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న జీవన్ రెడ్డికి ఈ పరిణామం మింగుడు పడటం లేదని తెలుస్తోంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లను పక్కన పెట్టడంపై పాత కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు 40 వార్డుల్లో గెలవాల్సిన చోట 20-22 సీట్లకే పరిమితం కావడానికి అంతర్గత కుట్రలే కారణమని ఇప్పటికే సంజయ్‌పై జీవన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు చైర్‌పర్సన్ పదవి కూడా ప్రత్యర్థి వర్గానికే దక్కడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ వర్గపోరు పార్టీని బలోపేతం చేస్తుందా లేక పతనానికి దారితీస్తుందా అన్నది వేచి చూడాలి.

Next Story