జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులకు గ్రీన్ సిగ్నల్!

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో నిలిచిపోయిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు శుక్రవారం నుంచి తిరిగి రోడ్డెక్కాయి.

జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులకు గ్రీన్ సిగ్నల్!
X
  • చైనా నిపుణుల తనిఖీలు పూర్తి.. రోడ్డెక్కిన 150 బస్సులు
  • సాఫ్ట్‌వేర్ మార్పులతో ఓవర్ ఛార్జింగ్, హీటింగ్ సమస్యలకు చెక్
  • ఈ నెలాఖరులోగా థర్డ్ పార్టీ ఆడిట్.. బస్ భవన్‌లో కమాండ్ కంట్రోల్: ఈడీ వెంకన్న

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిలిచిపోయిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు శుక్రవారం నుంచి తిరిగి రోడ్డెక్కాయి. ఈ బస్సుల సాంకేతిక సమస్యలపై చైనాకు చెందిన బ్యాటరీ నిపుణులు, జేబీఎం, ఆర్టీసీ సంయుక్త బృందం క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించింది. జేబీఎం బస్సులకు ఓవర్ ఛార్జింగ్ కావడం వల్లే బ్యాటరీ వేడెక్కుతున్నట్లు నిపుణుల బృందం ప్రాథమికంగా నిర్ధారించింది. ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగానే బ్యాటరీలు త్వరగా వేడెక్కుతున్నట్లు గుర్తించిన చైనా బ్యాటరీ నిపుణులు.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ మోడిఫికేషన్ ద్వారా ఛార్జింగ్ వేగాన్ని తగ్గించి విజయవంతంగా పరీక్షించారు. అనంతరం బ్యాటరీల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధారించిన తర్వాతే.. శుక్రవారం నాటికి తనిఖీలు పూర్తి చేసుకున్న నల్గొండ, సూర్యాపేట, వరంగల్, నిజామాబాద్ డిపోలకు చెందిన 150 బస్సులకు నిపుణుల సేఫ్టీ సర్టిఫికేషన్ లభించింది. ఈ సర్టిఫికేషన్ ఆధారంగా ఆర్టీసీ అధికారులు సదరు బస్సులను తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తూ రోడ్డెక్కించేందుకు అనుమతులు జారీ చేశారు. మిగిలిన బస్సుల తనిఖీలు కూడా పూర్తయిన వెంటనే వాటిని కూడా అనుమతిస్తామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. తమకు ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఈ నెలాఖరులోపు కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉన్న సంస్థ ద్వారా థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించామని, ఈ నెలాఖరు వరకు ఆడిట్ పూర్తి చేసేందుకు జేబీఎం సంస్థ అంగీకరించిందని వెల్లడించారు.

భవిష్యత్తులో జేబీఎం బస్సులకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు గాను బస్ భవన్‌లో ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసి, రెగ్యులర్‌గా సేఫ్టీ చెకింగ్ నిర్వహించాలని కంపెనీకి సూచించినట్లు ఈడీ వివరించారు. దీనిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని జేబీఎం యాజమాన్యం తెలిపిందని, దీనివల్ల బ్యాటరీల్లో ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే గుర్తించి సరిదిద్దే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈడీ వెంకన్న ప్రత్యేక చొరవ చూపడంతోనే జేబీఎం బస్సుల తనిఖీ ప్రక్రియ వేగంగా ముగిసి, తిరిగి రోడ్డెక్కేలా మార్గం సుగమమైందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Next Story