సంచలనం రేపిన భూ భారతి కుంభకోణం.. ఖజానాకు భారీ గండి.. తెరవెనుక ఉన్నదెవరు?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-11 02:21:14  IST  )

జనగామ జిల్లాలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాన్యువల్‌గా ఉన్న కాలంలోనూ చోటు చేసుకోని రీతిలో ఈ స్కాం జరగడంతో.. అసలు ఎలా సాధ్యమైందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.

సంచలనం రేపిన భూ భారతి కుంభకోణం.. ఖజానాకు భారీ గండి.. తెరవెనుక ఉన్నదెవరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : జనగామ జిల్లాలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాన్యువల్‌గా ఉన్న కాలంలోనూ చోటు చేసుకోని రీతిలో ఈ స్కాం జరగడంతో.. అసలు ఎలా సాధ్యమైందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అయితే ఇది ఒక్క మీ సేవా కేంద్రం నిర్వాహకుడి వల్ల సాధ్యమేనా? తెర వెనుక ఇంకెవరైనా ఉన్నారా? సాఫ్ట్ వేర్ స్క్రిప్ట్ కింగ్స్ పనేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విషయం తెలిసి ఉన్నతాధికారులు సైతం అవాక్కయ్యారు. ఇలాంటి దోపిడీకి అవకాశం లేకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు.

ఫేక్ చలాన్లతో సేల్ డీడ్స్

ధరణి పోర్టల్ కు ముందు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరిగేవి. అంతకు ముందు పూర్తి స్థాయిలో స్టాంప్ పేపర్ల మీద సేల్ డీడ్ వ్యవహారాన్ని ఫిజికల్ గా నడిపారు. ఆ తర్వాత డాక్యుమెంట్లను స్కాన్ చేసుకున్న తర్వాతే కొనుగోలుదారుడికి ఇచ్చే వారు. ఇప్పుడంతా ఆన్ లైన్ లోనే నడిపిస్తున్నారు. అయితే భూ భారతి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని భారీ కుంభకోణానికి తెర తీశారు. భూముల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాన్ని చెల్లించలేదు. అతి తక్కువ మొత్తాన్ని చలాన్ రూపంలో చెల్లించి ప్రాసెస్ చేయించారు. భూముల యజమానుల నుంచి మాత్రం పూర్తి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తాన్ని వసూలు చేసి, ఖజానాకు మాత్రం తక్కువగా జమ చేశారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి సేల్ డీడ్ చేయించారు. ఆడిట్ చేస్తుండగా అతి తక్కువ చలాన్లు కనిపించడంతో ఈ విషయం బయటపడింది. ఒకే రోజు పది చలాన్లకు చెందిన రూ.8,55,577 మింగారు. ప్రాథమిక పరిశీలన తర్వాత జనగామ జిల్లా జనగామ మండల తహశీల్దార్ ఇంద్రపల్లి హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపడుతున్నారు.

కొనసాగుతున్న విచారణ

భూ భారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై పోలీసుల విచారణ కొనసాగుతున్నది. మరోవైపు లోకాయుక్త కూడా సుమోటోగా కేసు నమోదు చేసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీ, మీ సేవా కమిషనర్, జనగామ జిల్లా రిజిస్ట్రార్లకు లోకాయుక్తా నుంచి ఆదేశాలందాయి. ఇప్పుడు థర్డ్ పార్టీ అప్లికేషన్ సాయంతో చలాన్ అమౌంట్ ఎడిట్ చేస్తున్న కేటుగాళ్లపై యాక్షన్ షురువైంది. యాదాద్రికి చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లు ఎడిట్ చేసి పేమెంట్ చేసినట్లుగా గుర్తించారు.

అనేక అనుమానాలు

ఈ కుంభకోణానికి సీసీఎల్ఏ టెక్నికల్ టీమ్ సిబ్బంది సహకరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది భూ భారతి అమల్లోకి వచ్చిన తర్వాతే మొదలైందా? అంతకు ముందు ధరణి పోర్టల్ అమల్లో ఉన్నప్పటి నుంచే నడుస్తుందా? అన్నది కూడా తేలాల్సి ఉన్నది. ప్రతి ట్రాన్సాక్షన్ స్టాంప్ డ్యూటీ ఎంత? చెల్లించిన చలాన్ అమౌంట్ ఎంత? వ్యత్యాసం ఎంత? ఈ లెక్కలు బయటికి తీస్తే తప్ప వాస్తవాలు బయటికి రావని నిపుణులు అంటున్నారు. ఉదాహారణకు ఒక కేసులో స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, పట్టాదారు పాసు బుక్ చార్జెస్, మ్యుటేషన్ ఫీజు, హరితనిధి మొత్తం కలిపి రూ.7,50,113గా ఉంది. ఐతే రూ.1000 ఈ-చలాన్ చొప్పున రెండు సార్లు అంటే రూ.2000 చెల్లించినా స్టేటస్ సక్సెస్ గా వస్తుంది. ఐతే ఇది సాఫ్ట్ వేర్ లోపభూయిష్టంగా ఉండడం వల్ల సాధ్యమవుతుందా? లేదంటే కేటుగాళ్లు ఇంకేదైనా చేస్తున్నారా? తెలియాల్సి ఉన్నది. మరోవైపు జావా స్క్రిప్ట్ చేసినోళ్లు, పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉన్నోళ్ల సహకారం ఉండొచ్చునన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కేవలం మీ సేవా నిర్వాహకులతోనే ఈ పని సాధ్యమవుతుందా? అన్న అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి ప్రక్రియ ఉంటుందని తమకు ఇప్పటి వరకు తెలియదని మీసేవ నిర్వాహకులే చెబుతున్నారు. తెర వెనుక ఎవరో పెద్దోళ్లు లేకుండా ఫేక్, ఫోర్జరీ చలాన్ల ద్వారా స్కాం సాధ్యమయ్యే పని కాదంటూ ఆపరేటర్లు వారి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ చర్చించుకుంటున్నారు.

యాక్షన్ షురూ

భూ భారతి పోర్టల్ లో సేల్ డీడ్, ఇతర డీడ్స్ కి నిర్దేశిత స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా ప్రాసెస్ ముందుకు వెళ్లకుండా దిద్దుబాటు చర్యలకు సీసీఎల్ఏ సీఎమ్మాఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్ శ్రీకారం చుట్టారు. ఫేక్, ఫోర్జరీ చలాన్ల ద్వారా ట్రాన్సాక్షన్లకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ‘దిశ’కు తెలిపారు.

Next Story