- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌కు భారీగా పెరుగుతోన్న మద్దతు.. హస్తానికి జై కొట్టిన మరో సంస్థ
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో క్రిస్టియన్ మైనారిటీ సమాఖ్య ఇప్పటికే కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇవ్వగా.. తాజాగా ఆ వరుసలో జమాత్-

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో క్రిస్టియన్ మైనారిటీ సమాఖ్య ఇప్పటికే కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇవ్వగా.. తాజాగా ఆ వరుసలో జమాత్-ఈ-ఇస్లామీ హింద్ సంస్థ కూడా ఆ పార్టీకే జై కొట్టింది. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న 69 మందికి మద్దతు పలికిన సంస్థ.. బీఆర్ఎస్‌లో మాత్రం 41 మంది అభ్యర్థులకు సహకారం అందించనున్నట్లు స్పష్టం చేసింది. మజ్లిస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నా ఏడుచోట్ల మాత్రమే మద్దతు ఇస్తామని, మిగిలిన రెండు చోట్ల ఇవ్వడంలేదని ఆ ప్రకటనలో తెలిపింది. పార్టీలకు అతీతంగా అభ్యర్థులవారీగా మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. స్థానికంగా ఉన్న యూనిట్ల అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని లోతుగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేసింది.
ఏయే నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థికి సహకారం అందించాలనే లిస్టును కూడా విడుదల చేసింది. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకి, సిర్పూర్‌లో బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. విలువలతో కూడిన రాజకీయాలు అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని.. అన్ని నియోజకవర్గాల్లోని జమాత్-ఈ-ఇస్లామీ యూనిట్ల నుంచి అభిప్రాయాలను తీసుకున్నామని, వాటిని పోలిటికల్ కమిటీ లోతుగా సమీక్షించి సిఫారసులు చేసిందని, కేంద్ర కమిటీకి పంపిన తర్వాత లభించిన ఆమోదం మేరకు నియోజకవర్గాలవారీగా ఏయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనేది ఖరారైందని వివరించింది.
ఒక మతపరమైన కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన సంస్థ.. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని, అందువల్లనే నిర్దిష్టంగా ఒక పార్టీకంటూ మద్దతు ఇవ్వలేదని, అభ్యర్థులవారీగా సపోర్టు ఇస్తున్నట్లు ప్రకటించామని సంస్థకు చెందిన పొలిటికల్ కమిటీ కన్వీనర్ ఆ ప్రకటనలో వివరించారు. ఇప్పటికే ముస్లిం సంఘాల జేఏసీ కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు పలకింది. తాజాగా జమాత్-ఈ-ఇస్లామీ హింద్ కూడా 69 స్థానాల్లో కాంగ్రెస్‌కే మద్దతు పలకడం గమనార్హం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సహకారం అందించగా, ఈసారి మాత్రం ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కిందిస్థాయి యూనిట్లకు సిఫారసు చేయడం విశేషం.






