- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaggareddy: కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులలో నీళ్లు తాగి మమ్మల్నే అంటారా? కేసీఆర్, హరీశ్ పై జగ్గారెడ్డి విమర్శలు
హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‍కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ సీఎంలు కట్టిన ప్రాజెక్టుల నీళ్లు తాగి పెరిగిన కేసీఆర్, హరీశ్‍రావు ఇప్పుడు కాళేశ్వరం కట్టాకే రాష్ట్రానికి నీళ్లు వచ్చినట్టు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) విమర్శించారు. కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలు మాట్లాడారని చెప్పారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. హరీశ్ రావు (Harish Rao) పీపీటీకి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు. అదేదో అసెంబ్లీలో మాట్లాడితే సరిపోయేది కదా అని ఎద్దేవా చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు ఇప్పుడు తమ రాజకీయ లబ్ధి కోసం ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ కుంపటి పెడుతున్నారని దుయ్యబట్టారు. జగన్, కేసీఆర్ కలిసి మాట్లాడినప్పుడు జల దోపిడీ గుర్తు రాలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినా తప్పు లేదా? సీఎం రేవంత్ రెడ్డి చేస్తే తప్పా అని ప్రశ్నించారు.
హరీశ్ రావువన్నీ దొంగ మాటలు:
2009లో టీడీపీతో కలిసి బీఆర్ఎస్ పోటీ చేయలేదా? చంద్రబాబుతో రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడితే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సీఎంలుగా చంద్రబాబు, కేసీఆర్ (KCR) కలిసి మాట్లాడినప్పుడు ఎందుకు తప్పుపట్టలేదని విమర్శించారు. హరీశ్ రావువి అన్ని దొంగ మాటలు దొంగ చేష్టలని దుయ్యబట్టారు. తెలంగాణ రైతులకు సాగునీరు, తాగునీరు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని అన్నారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇవ్వడంతో తెలంగాణ ప్రాంతంలో బీడు భూములు పంట పొలాలుగా మారి భూముల విలువలు అంచలంచలుగా పెరిగిందన్నారు. హరీశ్‍రావు మామ కేసీఆర్ టీడీపీ మినిస్టర్‍గా ఉన్నప్పుడు తెలంగాణ, ఏపీ మధ్య విభేదాలు లేవన్నారు. చిన్న రాష్ట్రాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నాడు రవాణాశాఖ మంత్రిగా అసెంబ్లీలో మాట్లాడింది వాస్తవం కాదా ? నాడు సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలను సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఆంధ్రల మెప్పుకోసం అలా మాట్లాడి ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ను టార్గెట్ చేయడానికి మాటమారుస్తారా అని నిలదీశారు. కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు.
అందుకే నాలుక కోస్తానని రేవంత్ అన్నారు:
పెండింగ్ ప్రాజెక్టులపై 2014లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ రెడ్డి మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయమని కేసీఆర్‍ని అడిగితే పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ తోలు తీస్తానని మాట్లాడితేనే సీఎం రేవంత్ రెడ్డి నాలుక కోస్తానన్నారు. అసెంబ్లీకి వచ్చి మీ సలహాలు ఇవ్వాలని కోరినా ఎందుకు రావడం లేదన్నారు. అధికారం లేకపోవడాన్ని కేసీఆర్ కుటుంబం తట్టుకోలేకపోతోందని అందుకే తెలంగాణ ప్రజలను మరోసారి మభ్యపెట్టే కార్యక్రమాన్ని మొదలు పెట్టారన్నారు.






