హరీశ్ రావు సాహసం ఏంటో అందరికీ తెలుసు.. జగ్గారెడ్డి కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2026-07-12 11:23:03  IST  )

మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ ఈటల రాజేందర్‌లపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హరీశ్ రావు సాహసం ఏంటో అందరికీ తెలుసు.. జగ్గారెడ్డి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి హరీశ్ రావుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రక్తం చిందించే ధైర్యం హరీశ్ రావుకు లేదని, హింసకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబానిదని విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకునేలా రెచ్చగొట్టే స్వభావం హరీశ్ రావుదన్నారు. ఇవాళ గాంధీ భవన్‍లో మాట్లాడిన జగ్గారెడ్డి.. మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ సంస్కృతి అయితే మాట నిలబెట్టుకోలేని సంస్కృతి బీఆర్ఎస్‍ది అన్నారు. హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడాన్ని పనిగా పెట్టుకున్నారని ఉద్యమ సమయంలో మీరు ఇచ్చిన స్పీచ్‍లకు తెలంగాణ యువకులు బలయ్యారని పెట్రోల్ పోసుకున్న హరీశ్ అగ్గిపెట్టే మర్చిపోరని హరీశ్ సాహసమేంటో కాంగ్రెస్‍కు తెలుసని ఎద్దేవా చేశారు.

డబ్బులు తీసుకున్నప్పుడు ఈటల మాట్లాడటం సహజమే:

కేసీఆర్‍తో ఈటల రాజేందర్‍కు బంధం ఉందని కేసీఆర్ ప్రభుత్వంలో ఈటల మంత్రిగా చేశారన్నారు. కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఈటల మాట్లాడటం సహజమే అని హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎంపీగా ఎన్డీఎస్ఏతో ఈటల మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ హరీశ్ రావును ఢిల్లీకి తీసుకువెళ్లాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలవబోతోందని, సిద్దిపేటలో పోటీ చేయాలని ఆదేశిస్తే పోటీ చేస్తానన్నారు. తుంగతుర్తి అంశం అన్నదమ్ముల లాంటి పోటీ అన్నారు. వ్యవస్థలో మొదటగా ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఉంటుందని ఆ తర్వాత ఎంపీకి, డీసీసీకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. వివాదంపై అందరి అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్తామన్నారు.

Next Story