విజయన్ అరెస్టు కోరింది రాహుల్‌గాంధీనే.. ఈడీ దాడులపై సీపీఎం రాఘవులు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

బీజేపీ దుర్మార్గాలకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమ పార్టీ నాయకులను కేసులతో భయపెట్టడం, బెదిరింపులకు దిగడం వంటి చర్యలకు మోడీ సర్కార్ పూనుకున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు విమర్శించారు.

విజయన్ అరెస్టు కోరింది రాహుల్‌గాంధీనే.. ఈడీ దాడులపై సీపీఎం రాఘవులు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ దుర్మార్గాలకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమ పార్టీ నాయకులను కేసులతో భయపెట్టడం, బెదిరింపులకు దిగడం వంటి చర్యలకు మోడీ సర్కార్ పూనుకున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు విమర్శించారు. బెదిరింపులకు, కేసులకు భయపడబోమని, ప్రతిఘటనా ఉద్యమాలతో మరింత బలపడతామని నొక్కి చెప్పారు. కేరళం మాజీ సీఎం పినరయి విజయన్‌పై ఈడీ దాడులను నిరసిస్తూ గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఎంబీ భవన్ (సీపీఎం రాష్ట్ర కార్యాలయం) నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నిరసనలో రాఘవులు మాట్లాడుతూ..కేరళం మాజీ సీఎం, పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్‌పై ఒక్క అవినీతి కేసు కూడా లేదన్నారు. ఈడీ చెబుతున్న కేసులో నిందితులు గానీ, ఆ సంస్థ గానీ ఏనాడూ విజయన్ పేరును ప్రస్తావించలేదని ఎత్తిచూపారు. ఇది ముమ్మాటికీ రాజకీయ దాడేనని తేల్చి చెప్పారు. విచారణల పేరుతో దాడులు చేయడం వామపక్షాలను, సీపీఎంను దెబ్బతీయడంలో భాగమేనన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీకి కొత్తగాదనీ, బీజేపీకి ఆటంకంగా మారిన కేజ్రీవాల్, సిసోడియా, ఆప్ నేతలు, జార్ఖండ్ సీఎం సోరెన్, తదితరులపై ఈడీని ప్రయోగించి రాజకీయంగా అణచివేసిందని విమర్శించారు. మరికొందరు నేతలను తనవైపు తిప్పుకుని, లొంగదీసుకుని సీఎంలను చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీ కేసులు పెట్టి విచారణల పేరుతో కోర్టుల చుట్టూ తిప్పిందని గుర్తుచేశారు.

కాంగ్రెస్ నేతల మౌనం వెనుక మర్మం

ప్రజలకు, ప్రతిపక్షాలకు విమర్శించే హక్కు, ప్రశ్నించే గొంతుకలు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను సీపీఎం ఖండిస్తూ వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిధులను ఐటీ స్తంభింపజేస్తే కూడా సీపీఎం ఖండించిందని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రజలను సమీకరించి ప్రతిఘటించే ఉద్యమాలు చేసే సీపీఎం నాయకులపై ఈ విధంగా దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ నేతల మౌనం వెనుక మర్మం ఏంటని ప్రశ్నించారు. కేరళంలో సీపీఎం బలహీనం చేయాలనే దుర్మార్గ పూరిత ఆలోచనతో కాంగ్రెస్, బీజేపీలు కలిపి ఈ దాడికి ఉసిగొల్పాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. ఇటీవల కొత్త ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రధాని మోడీని కలిసినప్పడు విజయన్‌ను అరెస్టు చేయాలని ఒత్తిడి తెచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.

విజయన్‌ను అరెస్టు చేయాలని ప్రచారం..

విజయన్‌ను అరెస్టు చేయాలని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం ముఖ్యమా? బీజేపీ నియంతృత్వానికి సహకరించడం ముఖ్యమా? అనే విషయాన్ని కాంగ్రెస్ తేల్చుకోవాలని సూచించారు. ఢిల్లీలో సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్, తదితరులు నిరసన తెలియజేసినందుకు అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తప్పుబట్టారు. విజయన్‌పైనే కాదు ఇంకెంత మంది సీపీఎం నాయకులపై కేసులు పెట్టి వేధించినా బీజేపీకి, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక, లౌకిక శక్తులను కలుపుకుని సీపీఎం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆ పోరాటంలో కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ..పినరయి విజయన్‌పై ఈడీ దాడులను ఖండిస్తున్నామన్నారు.

ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసి అప్రతిష్టపాలు చేయడానికి అక్రమ కేసులు పెట్టడం, పార్టీలను చీల్చడం వంటి నియంతృత్వ ధోరణులను కొనసాగించడానికి రాజ్యాంగ సంస్థలను బీజేపీ వాడుకుంటోందని విమర్శించారు. ఇలాంటి దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ గమ్ముగా ఉంటే ఆ పార్టీ మరింత నిర్వీర్యం అవుతుందని హెచ్చరించారు. మోడీ సర్కార్ అప్రజాస్వామిక విధానాలను మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యలు టి.జ్యోతి, ఎస్.వీరయ్య, జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, చుక్క రాములు, టి.సాగర్, పాలడుగు భాస్కర్, అబ్బాస్, మల్లు లక్ష్మి, బండారు రవికుమార్, పి.ప్రభాకర్, నున్నా నాగేశ్వర్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు, హైదరాబాద్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Next Story