- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధానికి వెల్‌కమ్ చెప్పే విషయంలో CM KCR డైలమా!
రేపు రాష్ట్రానికి రానున్న పీఎం నరేంద్ర మోడీకి వెల్‌కమ్ చేప్పేందుకు వెళ్లాలా? దూరంగా ఉండాలా? అనే డైలమాలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రేపు రాష్ట్రానికి రానున్న పీఎం నరేంద్ర మోడీకి వెల్‌కమ్ చేప్పేందుకు వెళ్లాలా? దూరంగా ఉండాలా? అనే డైలమాలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో స్వాగతం చెప్తే తలెత్తే పరిణామాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఏడాదిన్నరగా మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి దూరంగా ఉన్నారు. ఆయనకు బదులుగా జిల్లా మంత్రులు స్వాగతం పలికారు. శనివారం వరంగల్ పర్యటనకు రానున్న సందర్భంగా వెళ్తే ఎలా ఉంటుందని మల్లగుల్లాలు పడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
సందిగ్ధంలో సీఎం కేసీఆర్
కొన్ని రోజులుగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికరి ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ లీడర్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగానే డిల్లీ లిక్కర్ కేసులో కవిత విచారణ పెండింగ్ లోపడిందని, అందుకు ప్రతిగా బీఆర్ఎస్ లీడర్లు బీజేపీపై విమర్శల దాడిని తగ్గించారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానికి స్వాగతం పలికితే రాజకీయాల్లో తలెత్తే పరిణామాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.
గతంలో డుమ్మా
హుజూరాబాద్ బై ఎలక్షన్‌లో ఓటమి తర్వాత గులాబీ లీడర్లు బీజేపీపై ఎటాక్ ప్రారంభించారు. ఏ చిన్న అవకాశం వచ్చినా సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆపార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. చివరికి ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినా ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లలేదు. ఈ ఏడాదిన్నర సమయంలో నాలుగు సార్లు అధికారిక పర్యటన కోసం రాష్ట్రానికి మోడీ వచ్చారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ (ఫిబ్రవరి 5, 2022), ఇండియన్ బిజినెస్ స్కూల్ స్నాతకోత్సవం (మే 26, 2022), రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం (నవంబర్ 12, 2022), సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికరణ పనుల ప్రారంభానికి (ఏప్రిల్ 8, 2023) ప్రధాని మోడీ వచ్చారు. ఈ సందర్భాల్లో జిల్లాలకు చెందిన మంత్రులు మాత్రమే మోడీకి స్వాగతం పలికారు.
కనిపించని నిరసనలు
కొన్ని రోజులుగా బీజేపీ విషయంలో బీఆర్ఎస్ లీడర్లు విమర్శల దాడిని తగ్గించారని ప్రచారం జరుగుతన్నది. ప్రధానంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేటీఆర్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చినప్పటి నుంచి ఈ ప్రచారం మరింత ఊపందుకున్నది. అయితే గతంలో మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భాల్లో మంత్రులు వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శలు చేసేవారు. రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నారని, విభజన హామీలను అమలు చేయట్లేదని నిలదీసేవారు. గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు. నల్ల బెలూన్స్ ఎగరేయడం, మోడీ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి నిరసనల పర్వం ఎక్కడా కనిపించడం లేదు. మంత్రులు ప్రెస్‌మీట్స్ పెట్టి మోడీ పర్యటనపై విమర్శలు చేయడం లేదు.






