- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీనే.. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
బీసీ సంక్షేమం, ఆర్టీసీ, పోలీస్ శాఖల చర్చ సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల తీరును మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ సభ్యుల తీరుపై దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమైన అంశాలపై సభలో చర్చ జరుగుతుంటే వాకౌట్ చేయడం బీఆర్ఎస్ (BRS) సభ్యుల చిత్తశుద్ధి లేమికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. గత పదేళ్ల పాలనలో బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. అలాంటిది ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి ఎక్కడిదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు అడుగు ముందుకేస్తుంటే, బీఆర్ఎస్ సభ్యులు అక్కసుతో పది అడుగులు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వాకౌట్ డ్రామాలొద్దు..
సభలో చర్చకు నిలబడలేక బీఆర్ఎస్ సభ్యులు బయటకు వెళ్లడంపై మంత్రి శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. వాకౌట్ (Walk Out) చేస్తే రోజంతా చేయాలి.. కానీ ఇలా బయటకు వెళ్లి, మళ్లీ అలా లోపలికి రావడం ఏంటని ఫైర్ అయ్యారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారనే విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ, పోలీస్ సంక్షేమంపై స్పష్టత
కేవలం ఇన్నోవాలు సమకూర్చడమే పోలీస్ (Police) సంక్షేమం కాదని, పోలీసుల నిజమైన సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ (RTC)ని నిర్వీర్యం చేశారని, కార్మికులు సమ్మె చేసినప్పుడు కనీసం మాట్లాడేందుకు ఒక్కరంటే ఒక్కరూ వెళ్లలేదని విమర్శించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించింది తమ ప్రభుత్వమేనని వివరించారు. పారదర్శకత కోసం టెక్నాలజీ ఆధారిత విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
వచ్చే ఎనిమిదేళ్లూ మాదే అధికారం..
ప్రభుత్వ కాలపరిమితిపై వస్తున్న ప్రచారాలకు మంత్రి శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. తమకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని.. ఆ తర్వాత కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని స్పష్టం చేశారు. అంటే మొత్తం ఎనిమిదేళ్ల సమయం తమకు ఉందంటూ సెటైర్లు వేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని శ్రీధర్ బాబు అన్నారు.






