‘భూ భారతి’కి నేటితో సరిగ్గా ఏడాది.. చట్టం వచ్చినా మారని రైతుల తలరాత!

by Kema Shiva Kumar |

భూ భారతి చట్టం వచ్చి ఏడాది గడిచినా తెలంగాణలో భూ సమస్యలు ఓ కొలిక్కి రావడం లేదు.

‘భూ భారతి’కి నేటితో సరిగ్గా ఏడాది.. చట్టం వచ్చినా మారని రైతుల తలరాత!
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూభారతి చట్టం వచ్చి అప్పుడే ఏడాది గడిచింది. అయితే చట్టం వచ్చాక భూ సమస్యలు, దరఖాస్తులు పరిష్కారమయ్యాయా? డ్యాష్ బోర్డు మాత్రమే క్లియర్ చేశారా? ఇలా వివిధ అంశాలపై చర్చించుకోవాల్సిన సందర్భమిది. అయితే భూ భారతి చట్టం వచ్చినా న్యాయం జరగలేదన్న ఆవేదన చాలామందిలో కనిపిస్తున్నది. అయితే చట్టంలోనే లోపాలు ఉన్నాయా? గైడ్ లైన్స్ చట్టానికి అనుగుణంగా లేవా? అధికారుల్లో చిత్తశుద్ధి లేదా? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా గుర్తించకపోవడానికి కారకులు ఎవరన్న చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతున్నది. గతేడాది ఏప్రిల్ 14న తీసుకువచ్చిన భూభారతి వాస్తవానికి ఫ్యూచరిస్టిక్ చట్టం. ప్రతి సెక్షన్ ను అమలు చేస్తే భవిష్యత్తులో టైటిల్ గ్యారంటీ అమలు చేసే దిశగా అడుగులు వేయొచ్చు. అయితే చట్టానికి, రూల్స్ కి మధ్య తేడా కనిపిస్తున్నది. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ దరఖాస్తులు ఇప్పటికీ ఏండ్లకేండ్లు అపరిష్కృతంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. ధరణి కంటే భూ భారతిలో అవినీతి పెరిగిందా? తగ్గిందా? అంటే ఎలాంటి మార్పు లేదంటున్నారు అధికారులు. తమకు అధికారాలే లేనప్పుడు తామేం చేస్తామని తహశీల్దార్లు, వాళ్లకు అధికారాలు అప్పగిస్తే తమకేం పని అని కలెక్టర్లు అంటున్నట్లు చర్చ జరుగుతున్నది.

అధికార వికేంద్రీకరణకు అడ్డెవరు..?

భూ భారతి చట్టానికి అనుగుణంగా రూల్స్ రూపొందించాలి. కలెక్టర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా కిందిస్థాయి అధికారులకే అధికారాలను కట్టబెట్టాలి. సెక్షన్ 4, షెడ్యూల్-ఏ ని మార్చాలి. అధికారులకు భూ భారతి ఉద్దేశ్యాలు, లక్ష్యాలపై ఓరియెంటేషన్ ఇవ్వాలి. జీపీఓ నుంచి కలెక్టర్ దాకా దిశా నిర్దేశం చేయాలి. ప్రభుత్వం సామాన్య రైతుకు ఏమేం సేవలు, ఎలా అందించాలనుకుంటున్నదో అధికారులకు తెలియాలి. లేదంటే ఈ రూల్స్ పేరిట ఎంత కాలయాపన జరిగితే అంతగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. పీవోబీ జాబితాలను సిద్ధం చేసుకునే ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. గ్రామాలకు లిస్టులు పంపి అభ్యంతరాలను స్వీకరించాలి. పరిశీలించిన తర్వాతే తుది జాబితాను రిలీజ్ చేయాలి. అసైన్డ్ ల్యాండ్స్, ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్, సర్వే నంబర్ మిస్సింగ్, క్లాసిఫికేషన్ చేంజ్ వంటి వాటికి నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలి. లైసెన్సుడ్ సర్వేయర్ల విధి విధానాలు చట్టానికి లోబడే ఉండాలి. గైడ్ లైన్స్ పేరిట షరతులు అమలు చేస్తే భూ భారతి చట్టం సక్సెస్ కావడం కష్టమని నిపుణులు అంటున్నారు. అసలు అధికార వికేంద్రీకరణకు కలెక్టర్లు ఎందుకు అడ్డు చెప్తున్నారో విచారించాలి. తహశీల్దార్లు చేయాల్సిన పనులు కలెక్టర్ స్థాయిలో ఎందుకు చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. గుంట, రెండు గుంటల వివాదం కూడా కలెక్టర్ల దాకా ఫైల్ తెప్పించుకోవడం వివాదమవుతున్నది.

సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులు పెండింగ్

భూ భారతి చట్టం అమలైన తర్వాత రెవెన్యూ సదస్సులు జరిగాయి. అక్కడ స్వీకరించిన దరఖాస్తులు లక్షల్లోనే ఉన్నాయి. వాటిని ఇప్పటికీ పెండింగులో ఉంచడం వెనుక ఆంతర్యేమేమిటో కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో సదస్సుల పేరిట వచ్చిన దరఖాస్తులన్నీ అప్పటికప్పుడు పరిష్కరించారు. ఇప్పుడేమో నెలలు గడుస్తున్నా తిరస్కరించడం తప్పా.. పరిష్కరించి న్యాయం చేసిన దరఖాస్తులు ఎన్ని ఉన్నాయంటే వేళ్ల మీద లెక్కించాల్సిందే. సమాచార హక్కు చట్టం కింద రెవెన్యూ సదస్సుల కింద స్వీకరించిన దరఖాస్తుల్లో సగం కూడా పరిష్కరించలేదని తెలిసింది. తిరస్కరించినవే ఎక్కువగా ఉన్నాయి.

అప్పీల్ వ్యవస్థ ఏది..?

భూ భారతి చట్టంలో పేర్కొన్న అప్పీల్ వ్యవస్థ పోర్టల్ కి మాత్రమే పరిమితమైందన్న విమర్శలొస్తున్నాయి. నిజానికి ఆ వ్యవస్థను రూపొందించలేదు. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఎక్కడా కనిపించడం లేదు. కానీ అప్పీల్ చేసుకునేందుకు కాల పరిమితిని మాత్రం రాసుకున్నారు. ధరణి పోర్టల్ లో సామాన్యుడికి ఉపయుక్తమైన అప్పీల్ వ్యవస్థను రద్దు చేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారంటూ విమర్శించారు. భూ భారతి వచ్చినా అది అమలు చేయలేకపోవడం వెనుక ఐఏఎస్ అధికారులే ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లీగల్ సెల్స్ ఏవీ..?

చట్టం ప్రకారం పేద రైతులకు న్యాయ సాయం అందించేందుకు వ్యవస్థను రూపొందిస్తామన్నారు. లీగల్ సెల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు అలాంటి ఊసే లేకపోవడం గమనార్హం. పారా లీగల్స్ వ్యవస్థను పునరుద్ధరించడం ద్వారా భూ సమస్యలు ఎదుర్కొనే వారికి ఉచితంగా న్యాయ సలహాలు అందించడం వల్ల సామాన్య రైతులకు ఆర్థిక భారం తప్పుతుందని ఆ సెక్షన్ ని చేర్చారు.

ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్‌తో..

ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ తో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ ఎంతో మంది తమ సర్వే నంబర్ మిస్ అయ్యిందని, విస్తీర్ణం తక్కువగా పడిందంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి అప్లికేషన్లను ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అంటూ రిజెక్ట్ చేస్తున్నారు. నిజానికి పరిష్కార మార్గం ఓల్డ్ ఆర్వోఆర్ లను పరిశీలించడమే. ఇల్లీగల్ గా కొనసాగుతున్న వారిని తొలగించాలి. అమ్మేసిన వారి పేరిటే కొనసాగిస్తుండడం వల్లే విస్తీర్ణం పెరిగిందని తహశీల్దార్లకు తెలుసు. కానీ పాత రికార్డులను పరిశీలించి అదనపు విస్తీర్ణం ఎవరి పేరిట ఉందో వారిని తొలగించేందుకు ససేమిరా అంటున్నారు. ఎవరినైన గుర్తించినా నోటీసులతో సరి పెడుతున్నారు. కాలయాపనతో ఏండ్లు గడుస్తున్నాయి. దాంతో భూమి లేనోళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. నిజమైన అర్హులు హక్కులతో పాటు సంక్షేమ పథకాలు మిస్ అవుతున్నారు. దీనికి గైడ్ లైన్స్ ఇచ్చేందుకు భూ భారతితో సంబంధమే లేదు. కానీ కాలయాపన చేస్తూ కాలం వెళ్లదీస్తుండడం వల్ల చట్టం వచ్చినా చేయడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖాస్రా పహానీతో..

ల్యాండ్ క్లాసిఫికేషన్ ని నిర్దారించేందుకు ఖాస్రాపహానీ, సేత్వార్ గా తీసుకోవడం ద్వారా లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. క్లాసిఫికేషన్ చేంజ్ చేసి రికార్డులు రాసేశారు. ఇప్పటికే 50, 60 ఏండ్లయ్యింది. అనేక క్రయ విక్రయాలు జరిగాయి. అప్పటి నుంచి పట్టాగా రికార్డుల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడేమో ఖాస్రా పహానీలో సర్కారీ ఉందని, శివాయి జమాయి, గైరాన్ ఉందంటూ పట్టా భూములను బ్లాక్ చేస్తున్నారు. ఆఖరికి 2017 లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనూ 1 బీ నోటీసులు జారీ చేయడం ద్వారా కొత్త పాసు పుస్తకాలు ఇచ్చారు. అప్పుడు కూడా పట్టాగానే ఉంది. కొందరు జిల్లా కలెక్టర్లు మాత్రం 20, 30 ఏండ్లుగా రికార్డుల్లో పట్టా అని ఉంటే రికమండ్ చేస్తున్నారు. కొందరేమో ఖాస్రా, సేత్వార్ ప్రామాణికమంటూ స్టాంప్ డ్యూటీ కట్టి చేసుకున్న సేల్ డీడ్, మ్యుటేషన్ ఆర్డర్ కాపీ, పట్టాదారు పాసు పుస్తకాలు, పాత ఆర్వోఆర్ రికార్డులను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఎన్నేండ్ల వరకు రికార్డులను పరిశీలించి క్లాసిఫికేషన్ ని నిర్ణయించాలో అధికారులకు తెలియజేసే సర్క్యులర్ జారీ చేయకపోతే ప్రభుత్వంపై విమర్శలొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story