మంత్రి కొండా సురేఖకు ఇస్కాన్ ప్రతినిధుల ఆహ్వానం

by Gantepaka Srikanth |

ధ్యాత్మిక వికాసంతో పాటు సమాజ సేవలో ఇస్కాన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని మంత్రి కొండా సురేఖ అన్నారు.

మంత్రి కొండా సురేఖకు ఇస్కాన్ ప్రతినిధుల ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నలగండ్లలో మార్చి 8న నిర్వహించనున్న నూతన ఇస్కాన్ సైబరాబాద్ దేవాలయం, లక్షమందికి అన్నదానం చేసే మహా వంటశాల భూమిపూజ కార్యక్రమానికి హాజరుకావలసిందిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఇస్కాన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. శ్రీకృష్ణుడికి అంకితమై నిర్మించనున్న ఈ దేవాలయానికి సంబంధించిన స్థల కేటాయింపులో మంత్రి కీలక పాత్ర పోషించారని నిర్వాహకులు తెలిపారు. ఆమె సహకారంతోనే భూమిపూజ కార్యక్రమం త్వరితగతిన నిర్వహించే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక వికాసంతో పాటు సమాజ సేవలో ఇస్కాన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా పేదలకు అన్నదానం అందించడం గొప్ప కార్యక్రమమని కొనియాడారు. రాష్ట్రంలో నిర్మించనున్న ఈ విస్తృత దేవాలయ భూమిపూజకు ఆహ్వానించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులను కూడా ఆహ్వానించాలని మంత్రి సూచించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా జరగనున్న ఈ కార్యక్రమంలో భక్తులు, ఆధ్యాత్మిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణకు ఈ ఆలయం కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story