తెలంగాణలోనూ Gujarat ఫలితాలే రిపీట్?

by Disha Web Desk 2 |
తెలంగాణలోనూ Gujarat ఫలితాలే రిపీట్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ వీడిపోయింది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం చేపట్టబోయే పార్టీలపై ఓ స్పష్టత వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో మరోసారి అధికారం దక్కించుకోవాలని ప్రయత్నించిన బీజేపీ గుజరాత్ లో మాత్రం హిస్టరీ క్రియేట్ చేస్తూ గతంలో ఏ పార్టీ సాధించనన్ని సీట్లు కైవసం చేసుకునే దిశగా దూసుకోపోతోంది. గుజరాత్ ఫలితాలతో దేశవ్యాప్తంగా 2024 లోక్ సభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. దీంతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో గుజరాత్ ఎన్నికల ప్రభావం ఏ మేరకు ఉండబోతోందనేది ఆసక్తిని రేపుతోంది. తాజాగా ఈ అంశంపై తెలంగాణ బీజేపీ వ్యవహరాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ స్పందించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ప్రజలు మోడీ వైపు ఉన్నారని, పేద ప్రజల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే గుజరాత్ లో ప్రభుత్వ గెలుపుకు దోహదం చేశాయన్నారు.

లోక్ సభ ఎన్నికలపై గుజరాత్ ఎఫెక్ట్?:

గుజరాత్ ఫలితాల ప్రభావం రాబోయే లోక్ సభ ఎన్నికలపై ఏ మేరకు ఉండబోతోందనేది అందరిలో చర్చగా మారింది. అన్ని పార్టీలు ఇదే అంశంపై ఇప్పుడు ఫోకస్ పెట్టాయి. నిజానికి 2024 సార్వత్రిక ఎన్నికల కంటే మరి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిపై కూడా గుజరాత్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉండబోతోందనేది ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకమైనవి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా ఇతర కీలక నేతలు గుజరాత్ కు చెందిన వారే కావడం, బీజేపీ ప్రయోగాలకు ఈ రాష్ట్రమే కంచుకోట అయినందునా గుజరాత్ ఎన్నికలకు ఎప్పుడూ జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ఈ ఎన్నికలు సెమీ ఫైనల్ అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే గుజరాత్ ఫలితాలు రాబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల గెలుపోటములు నిర్ణయిస్తాయా అనే చర్చ జరిగినప్పుడు అవును అని 24 శాతం మంది సమాధానం చెప్పినట్టు ఓ జాతీయ సంస్థ చేపట్టిన సర్వేలో స్పష్టం అయింది. అయితే నిజంగానే గుజరాత్ ఫలితాల ప్రభావం రాబోయే ఎన్నికల్లో చూపగలిగితే అది బీజేపీకి అనుకూలమా వ్యతిరేకమా అనేది చర్చగా మారింది. గుజరాత్ ఫలితాలు ప్రభావం చూపగలిగితే బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఏ విధంగా వ్యవహరించబోతున్నాయి అనేది ఆసక్తికర అంశం కాబోతోంది.

హిమాచల్ లో సీన్ రివర్స్:

గుజరాత్ లో రికార్డ్ విజయం నమోదు చేసుకున్న బీజేపీ హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ మరోసారి సెంటిమెంట్ రిపీట్ అయింది. వరుసగా రెండోసారి అధికారం ఏ పార్టీకి అప్పగించని ఓటర్లు ఈ సారి కూడా బీజేపీ సర్కార్ ను ఇంటికి పంపించి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. దీంతో రాబోయే ఎన్నికల్లో గుజరాత్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో హిమాచల్ ప్రదేశ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందనే చర్చ జరుగుతోంది. గుజరాత్ కు వచ్చే సరికి మోడీ, అమిత్ షా ల సొంత రాష్ట్రం, బీజేపీకి కంచుకోట వంటి అంశాలు అనుకూలించాయనే వాదన వినిపిస్తోంది. అలాగే దేశంలోని బడా వ్యాపారులందరూ గుజరాత్ కు చెందిన వారే కావడం కూడా ఓ ఫ్యాక్టర్ అనే చర్చ జరుగుతోంది. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వమే కొనసాగగా హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం బీజేపీ అధికారం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఫలితాల ప్రభావం ఉంటుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి కొందరేమో గుజరాత్‌లో బీజేపీకి ప్రజాదరణ ఉన్నప్పటికీ, రాష్ట్ర మరియు జాతీయ ఎన్నికల ఫలితాల్లో అధికార వ్యతిరేక అంశం కూడా కీలకం కావచ్చని ఇవి రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య వేరుగా ఉంటాయనే వాదన వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఆ లోపు మిగతా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దాంతో ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకుంటాయో వాటి పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో అనేది కీలకం కానుంది.

Also Read: త్వరలోనే కేటీఆర్, హరీష్‌రావు బండారం బట్టబయలు : Bandi Sanjay


Next Story

Most Viewed