KCR ఎందుకు మధ్యలో వదిలేశారు?.. లీఫ్స్ సంస్థ చర్చల్లో వెలుగులోకి కీలక అంశాలు!

by Gantepaka Srikanth |

అమెరికాలో ఎక్కడ చూసినా వేల ఎకరాల్లో సాగు.. అదంతా ఒకే వ్యక్తి సొంతం. మరేదైనా కంపెనీ పేరిట ఉంటుంది. కనుచూపు మేరలో కనిపించే భూమిలో వ్యవసాయమంతా ఒకరిద్దరితోనే సాధ్యం.

KCR ఎందుకు మధ్యలో వదిలేశారు?.. లీఫ్స్ సంస్థ చర్చల్లో వెలుగులోకి కీలక అంశాలు!
X

అమెరికాలో ఎక్కడ చూసినా వేల ఎకరాల్లో సాగు.. అదంతా ఒకే వ్యక్తి సొంతం. మరేదైనా కంపెనీ పేరిట ఉంటుంది. కనుచూపు మేరలో కనిపించే భూమిలో వ్యవసాయమంతా ఒకరిద్దరితోనే సాధ్యం. మన దేశంలో మాత్రం ఎకరం.. అరెకరంతోనే సాగు. ఎందుకీ వ్యత్యాసం? అతి తక్కువ విస్తీర్ణాల్లో వ్యవసాయం చేయడం ద్వారా నష్టపోవడం లేదా? చిన్న భూ కమతాల ద్వారా పెట్టుబడులు పెరుగుతున్నాయి కదా.. వీటి ద్వారా సాగులో భూమి నిరుపయోగం కూడా ఎక్కువే. అలాంటప్పుడు పెద్ద కమతాలు ఎందుకు చేయలేకపోతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ పలుమార్లు భూ కమతాల ఏకీకరణ అంశాన్ని తెర మీదికి ఎందుకు తీసుకొచ్చారు? ఆయన పదేండ్ల పాలనలో ఎందుకు ఫ్రాగ్మెంటేషన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు? దీనికేమైనా విధి విధానాలు రూపొందించారా? ఎర్రవెల్లిని పైలెట్ గ్రామంగా ఎంపిక చేసి ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయారు. భూ కమతాల ఏకీకరణకు చట్టాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు దేశంలో తగ్గిపోతున్న భూ కమతాల విస్తీర్ణాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దేశంలో వ్యవసాయం, రైతు సంక్షేమం, అభివృద్ధిపైన లీఫ్స్ అనే సంస్థ చర్చా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మరికొన్ని అత్యంత ప్రాధాన్యతాంశాలపై ఇటీవల చర్చించింది. ఇందులో వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలపైన లోతైన అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ వంటి పథకాల మీదనే చర్చిస్తున్నాయి.

అలాగే రాజకీయ పార్టీలు, రైతు సంఘ నాయకులు కూడా అలాంటి అంశాలపైనే పోరాడుతున్నాయి. కానీ వాటి కంటే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకురావాల్సిన మార్పుల గురించి ఎక్కడా చర్చించకపోవడం బాధాకరంగా ఉందని లీఫ్స్ చర్చల్లో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. భూ కమతాల ఏకీకరణపైనే చర్చించి.. దాని వల్ల లాభమా? నష్టమా? అన్న దానిపై అభిప్రాయాలు వ్యక్తీకరించాల్సిన రైతు సంఘ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు. నకిలీ విత్తనాలతో రైతులకు నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వాన్ని నష్టపరిహారం ఇవ్వాలంటూ రోడ్డెక్కుతారు. కానీ సదరు కంపెనీకి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేయడం లేదు. కాంట్రాక్ట్ వ్యవసాయం వద్దంటారు. కానీ ఎందుకు వద్దు అన్న విషయాలను ఎక్కడా ప్రస్తావించరు. ఇలాంటి అనేకాంశాలపై రైతులు, అధికారులు, పాలకులు చర్చించాల్సిన అవసరం ఉందని లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల చర్చించిన అనేకాంశాల గురించి ‘దిశ’కు వివరించారు. (శిరందాస్ ప్రవీణ్​కుమార్)

భూ కమతాల ఏకీకరణ అంటే?

మాజీ సీఎం కేసీఆర్ చాలా సార్లు భూ కమతాల ఏకీకరణ చేయాలని పిలుపునిచ్చారు. అంటే ఏమిటి? దీని వల్ల లాభాలేంటి? ఎందుకు చేయాలి? సాధ్యమేనా? అవును .. లాభాలు ఉన్నాయి. చేయడానికి మార్గాలు ఉన్నాయి. రాష్ట్రం, దేశ వ్యాప్తంగా కమతాలు చాలా చిన్నగా అవుతున్నాయి. తెలంగాణలో సగటున రైతుకు 1.20 ఎకరాలే ఉంది. అది కూడా ఒకే దగ్గర లేదు. ఎక్కడెక్కడో ఉంది. అంతా కలిపితే సగటు ఎకరంన్నరకు మించడం లేదు. ఇప్పుడేమో గుంట, రెండు గుంటల భూమి ఉన్నోళ్లు కూడా రైతులేమనంటున్నారు. ఇంత తక్కువ కమతాల్లో చేసే వ్యవసాయం ఎంత? దిగుబడి ఎంత? కమతాలు మరీ చిన్నవి కావడం వల్ల దిగుబడి తీవ్రంగా పడిపోతుంది. పెట్టుబడి పెరుగుతుంది. సాగులో యంత్రీకరణ సాధ్యం కాదు. పెద్ద పెద్ద కమతాల్లో సాగు చాలా ఈజీ. యాంత్రీకరణ ద్వారా అధిక దిగుబడి సాధించే వీలుంటుంది. కొందరికి ఒకే ఊరిలో రెండు, మూడు చోట్ల భూమి ఉంటుంది. అంతా కలిపితే రెండు, మూడు ఎకరాలు కూడా ఉండదు. ఇలాంటి భూముల్లో వ్యవసాయం చేయడం ఆ రైతుకు కూడా కష్టమే. అందుకే కనిష్టంగా రైతుకు ఇంత భూమి ఉంటే బాగుంటుందన్న సీలింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. మన దేశంలో రైతుకు ఉండే భూమి చతురస్రమో, దీర్ఘ చతురస్రాకారంలో ఎంత మందికి ఉందంటే చెప్పడం కష్టమే. అందరి భూమి అమీబా ఆకారంలోనే ఉంటుంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో భూ కమతాలు వందలు, వేల ఎకరాల్లో ఉంటుంది. ఆఖరికి న్యూజీలాండ్ వంటి చిన్న దేశాల్లో కూడా 50 ఎకరాలకు పైగా కమతం ఉంటుంది. మానవ వనరుల అవసరమే లేకుండా సాగుబడి నడుస్తున్నది. అందుకే దిగుబడి అధికంగా ఉంటుంది. మన దేశంలోనూ ఇది చేయాలన్న సంకల్పంతో చట్టాలు చేశారు. అంతెందుకు? తెలంగాణలోనూ హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడే తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్ యాక్ట్, 1956 అమల్లో ఉందంటే నమ్మగలమా? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనూ అమల్లో ఉన్నట్లే. భూ కమతాల ఏకీకరణలో పంజాబ్ రాష్ట్రం సక్సెస్ అయ్యింది. అందుకే అక్కడ పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. మెకనైజేషన్ లోనూ విజయం సాధించారు. అందుకే దిగుబడిలో ముందు వరుసలో ఉన్నారు.

పైలెట్ ప్రాజెక్టుగా ఎర్రవెల్లి ఎంపిక

ప్రతి రైతుకు వేర్వేరు ప్రాంతాల్లో కొంత చొప్పున ఉండడం కంటే అంతా ఒకే దగ్గర ఉండడం వల్ల భూ కమతం పెరుగుతుంది. దేశంలో చాలా మంది రైతులకు ఈ సమస్య నెలకొన్నది. అన్నదమ్ములు భూమి పంపకాలు, వేర్వేరు చోట్ల భూమి కొనుగోళ్ల ద్వారా ఈ సమస్య జటిలమైంది. ఐతే ఫ్రాగ్మెంటేషన్ చేయడం సాధ్యమేనని పంజాబ్ వంటి రాష్ట్రం నిరూపించింది. తెలంగాణలో రైతు కనీస భూ కమతం 1.20 ఎకరాలు మాత్రమే. దీన్ని ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాలంటీర్ గానే ఏకీకరణ చేయడానికి వీలుంది. రైతుల పరస్పర అంగీకారం ద్వారా మార్చుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలిరోజుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి ఏకే గోయెల్ దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించారు. బలవంతంగానైనా ఏకీకరణ చేయాలని యోచించారు. అందుకే ఎర్రబెల్లిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఆ గ్రామాన్ని నోటిఫై చేశారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ అప్పట్లో భూ కమతాల ఏకీకరణ అంశాన్ని పలు బహిరంగ సభల్లోనూ ప్రస్తావించారు. దీని వల్ల ఉత్పత్తి పెరగుతుంది. యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేయొచ్చు. ఎరువులు, రసాయనాల వినియోగం తగ్గుతుంది. ల్యాండ్ డెవలప్మెంట్ ఈజీ అవుతుంది. వ్యవసాయంలో ల్యాండ్ వేస్ట్ తగ్గుతుంది. రానున్న రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా పెద్ద భూ కమతాలు అనివార్యంగా మారుతుంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిందే.

ల్యాండ్ యూజ్ పాలసీ అవసరం

ఎక్కడైనా వ్యవసాయం, పరిశ్రమలు, ఇండ్లు.. ఇతర అవసరాలకు భూమి అవసరం. అభివృద్ధి పేరిట ఇష్టానుసారంగా భూ వినియోగం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇదిలాగే కొనసాగితే వ్యవసాయానికి భూమి ఉంటుందా? పరిశ్రమలకు భూములు దొరుకుతాయా? అందుకే ల్యాండ్ యూజ్ పాలసీ అవసరం. ఉదాహారణకు హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఏడాది క్రితం వరకు సిరిస్ అనే కెమికల్ కంపెనీ ఉండేది. ఇప్పుడక్క భారీ హైరైజ్డ్ బిల్డింగ్ కడుతున్నారు. వాసవి అనే డెవలపర్ బహుళ అంతస్థుల భవనాలు కడుతున్నారు. మొన్నటి దాకా పరిశ్రమ నడిచిన చోటే రెసిడెన్షియల్ జోన్ ఆకస్మాత్తుగా ఎలా మారింది. దానికి అనుగుణంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? మనిషి మనుగడకు అవసరమైన ఏమేం రక్షణ, కెమికల్ నియంత్రణ చర్యలు తీసుకున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఉత్నన్నమవుతాయి. ఇండస్ట్రిస్, ఫారెస్ట్, అగ్రికల్చర్, రెసిడెన్షియల్.. ఇతర అవసరాలకు భూమి ఉండేటట్లుగా చూడాలి. వాటికి సంబంధించిన జోన్లను రూపొందించాలి. అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ జోన్ లోకి ఈజీగా మార్చేస్తున్నారు. ప్రతి గ్రామ స్థాయిలోనూ ఈ జోన్లను గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో యూపీలో ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ యూజ్ పాలసీ డ్రాఫ్ట్ ని సిద్ధం చేసింది. ఎన్డీయే కూడా జర్మనీ సంస్థ సహకారంతో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లో ల్యాండ్ యూజ్ పాలసీ అమలుకు చర్యలు చేపట్టారు. కానీ ప్రస్తుతానికి రాజకీయ కారణాల చేత స్తబ్ధత నెలకొన్నది. ఇకనైనా అన్ని రాష్ట్రాల్లోనూ ల్యాండ్ యూజ్ పాలసీని అమలు చేయాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు ఏదైనా మనం అందించాలంటే ఇది అనివార్యం.

రైతే బ్రాండ్

కూరగాయలు, ఆకు కూరలు, పప్పులు, మిల్లెట్స్ వంటివి మార్కెట్ లో బ్రాండ్ల పేరిట అమ్మేస్తున్నారు. రకరకాల లేబుళ్లతో అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా ఆర్గానిక్ ఉత్పత్తులు అంటూ బ్రాండ్ పేరిట వ్యాపారం చేస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. ఐతే ఆ ఉత్పత్తులను రైతులే వారి పేర్లతో అమ్మేందుకు వెసులుబాటు ఉంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నప్పుడు సొంతంగా పండించినవిగా బ్రాండ్ చేసుకునే హక్కు ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ రూల్స్ ఉన్నాయి. రైతులు సింగిల్ గానూ, గ్రూపుగానూ.. ఆ ఊరంతా కలిసి గ్రూప్ సర్టిఫికేషన్ పొందొచ్చు. ఎగుమతి చేయాలంటూ ఇబ్బందులు ఉంటాయి. కానీ పండించిన రైతులే వారి బ్రాండ్ పేరిట అమ్ముకోవడానికి మార్గాలు ఉన్నాయి. బడా కంపెనీలు ఆర్గానిక్ ఉత్పత్తులు అంటూ రైతుల నుంచి కొనుగోలు చేసిన వాటికి బ్రాండ్ ఇమేజ్ ని జత కట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. మండలం, జిల్లా రైతాంగం కలిసి రీజినల్ సర్టిఫికేషన్ కూడా పొందే వీలుంది. ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపధ్యంలో రైతాంగం తమ పేర్లతోనే బ్రాండ్ ని సొంతం చేసుకోవచ్చు. ఆర్గానిక్ ప్రొడక్టుగా మార్కెట్ లో విక్రయించడం ద్వారా రెట్టింపు గిట్టుబాటు లభిస్తుంది. చాలా సంతల్లో రైతులు వారు పండించిన కూరగాయలను అమ్ముతున్నారు. అదే వారి బ్రాండ్ తో అమ్మేస్తే ఆర్గానికి ఉత్పత్తులుగా బహుళ ప్రచారం లభిస్తుంది. ఇదే అంశాన్ని లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లిలో రైతాంగానికి భూమి సునీల్ వివరించారు. ఆ ఏరియా నుంచి చాలా వరకు పూదీనా, కొత్తిమీరా, ఆకు కూరలు హైదరాబాద్ కు వస్తున్నాయి. ఆ రైతులు ఎలాంటి రసాయనాలు వాడడం లేదు. అదే గ్రూప్ సర్టిఫికేషన్ పొంది ఆర్గానిక్ ప్రొడక్ట్ గా మార్కెట్లోకి తీసుకెళ్తే అధిక లాభాలు వస్తాయని సునీల్ వివరించారు. ఆయనతో పాటు వ్యవసాయం, రైతు అభివృద్ధి కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, ఇతర సభ్యులు కూడా అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఇదే తరహా రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో కూరగాయలు పండిస్తున్న ప్రతి రైతు సర్టిఫికేషన్ పొందడం ద్వారా కార్పొరేట్ కంపెనీల నుంచి తప్పించుకునే వీలుంది.

కాంట్రాక్ట్ వ్యవసాయం ఉందా?

నిజమే దేశ వ్యాప్తంగా కాంట్రాక్ట్ వ్యవసాయం ఉంది. అదే చట్టం రూపంలో తెచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నాలు చేయగానే దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కానీ పండించబోయే పంటకు ముందే ధర నిర్ణయించడం, పండిన పంటనంతా ఆ కంపెనీ కొనుగోలు చేసేటట్లుగా ఒప్పందాలు కుదర్చుకుంటారు. ఈ ప్రాసెస్ చాలా ప్రాంతాల్లో ఇల్లీగల్ గా అమలవుతూనే ఉన్నది. ఈ విషయాన్ని లేవనెత్తితే కంపెనీలకు మేలు చేస్తున్నారన్న ప్రచారం నడుస్తున్నది. ఉదాహారణకు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పండించిన కూరగాయలను రైతుల నుంచి కంపెనీలు కొనుగోలు చేయడం లేదా? వారికి ఇష్టమొచ్చిన రేట్లను నిర్ణయించడం లేదా? నగరంలోని ప్రధాన మార్ట్ లన్నీ నగర శివార్ల నుంచే కొనుగోలు చేస్తున్నాయి. అదే ముందే రైతులతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే నష్టమేంటి? పండిన పంటను డిమాండ్ కి తగ్గట్లుగానే సదరు కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. అధిక దిగుబడి వచ్చినప్పుడు చేతులెత్తేస్తున్నాయి. కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టాలు అమల్లోకి రావడం ద్వారా ముందు ధర నిర్ణయిస్తారు. పండిన పూర్తి పంటను కంపెనీ కొనుగోలు చేయాల్సిందే. కాంట్రాక్ట్ వ్యవసాయం ఇల్లీగల్ నడుస్తున్నదన్న వాస్తవాన్ని గ్రహించడం లేదు. దీనికి సంబంధించిన చట్టాలు కూడా అమల్లోనే ఉన్నాయి. ఉదాహారణకు అగ్రికల్చర్ మార్కెట్ యాక్ట్ లో సెక్షన్ 10 ఎ అదే చెబుతున్నది. అందులో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అథారిటీగా ఉంది. అదే మోడీ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న చట్టంలో ఆర్డీవోను అథారిటీగా నిర్ణయించింది. పైగా ఏ కంపెనీ రైతుల నుంచి పంటను కొనుగోలు చేయాలన్నా తప్పనిసరిగా అగ్రిమెంట్ కుదుర్చుకోవాలన్న నిబంధనను పెట్టారు. అలాగే భూమి మీద ఎలాంటి హక్కులు ఉండవని కూడా స్పష్టం చేశారు. తెలంగాణలో 25 లక్షల మేరకు కాంట్రాక్ట్ వ్యవసాయం ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా నడుస్తున్నదే. కానీ కేంద్రం కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టాన్ని తీసుకొస్తామనగానే కార్పొరేట్లకు మేలు చేస్తున్నారన్న ప్రచారం నడిచింది. కానీ అగ్రికల్చర్ మార్కెట్ యాక్టులో ఉన్న సెక్షన్ 10ఎ ని గుర్తించడం లేదు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ నష్టమనుకుంటే ఈ సెక్షన్ కూడా తొలగించాలి కదా.. అందుకే రానున్న రోజుల్లో పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించాలంటే ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం మీద పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

విత్తనాలతో మోసపోతే..

దేశంలో చాలా ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు, రసాయనాలతో మోసపోయామంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేసిన ఉదంతాలు అనేకం. తెలంగాణలోనూ తరచూ కనిపించే దృశ్యాలే. కానీ నకిలీ విత్తనాలతో మోసపోతే నష్టపరిహారం పొందొచ్చునన్న అంశంపై రైతులకు అవగాహన కల్పించడం లేదు. విత్తనాల చట్టం 1966, కొత్త వంగడాల చట్టం 2001, పత్తి విత్తనాల చట్టం 2005 వంటివి అనేకం రైతులకు మేలు చేసేవే. కానీ ఆ చట్టాలు ఉన్నాయని, ఎలా వినియోగించుకోవాలో వ్యవసాయ శాఖ మాత్రం అవగాహన కల్పించేందుకు ముందడుగు వేయడం లేదు. మహారాష్ట్రలో విత్తన చట్టంలో సవరణలు చేసుకున్నది. మోసం చేసినట్లుగా రుజువైతే వేసే శిక్షలను పెంచింది. పెనాల్టీలను భారీగా విధిస్తున్నది. అలాగే ప్రభుత్వమే ధరలు నిర్ణయించాలి. ఇక్కడేమో సదరు కంపెనీ ఎమ్మార్పీ రేటును యాజమాన్యాలే నిర్ణయిస్తున్నాయి. అంత కంటే ఎక్కువకు అమ్మినా ఎలాంటి చర్యలు ఉండడం లేదు. కంపెనీ విత్తనాలను నమ్మిన రైతులను నట్టేట ముంచిన సందర్భాల్లోనూ న్యాయం పొందలేకపోతున్నారు. కంపెనీల నుంచి పూర్తి స్థాయిలో నష్టపరిహారం పొందే విధి విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన బిల్లులు, విత్తనాల లేబుల్స్, బ్యాచ్ వంటి తెలిపేందుకు వినియోగించిన కవర్లు వంటివి దాచుకోవడం ద్వారా ఎంతో మేలు కలుగుతుంది. ఆఖరికి వినియోగదారుల ఫోరంలో తాము నష్టపోయామని ఒక్క తెల్ల కాగితం మీద రాసి దరఖాస్తు చేసుకున్నా సదరు కంపెనీ నుంచి నష్టపరిహారం వసూలు చేసే వెసులుబాటు ఉంది. ఇలాంటి చట్టాలపై రైతులకు అవగాహన కలిగించే కార్యక్రమాలను రూపొందించాలని లీఫ్స్ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యూ సీడ్ బిల్లును రూపొందించడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చర్చలో నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐతే ఈ బిల్లును కేంద్రం రూపొందించాలా? రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయాలా? అన్న సందేహంతోనే చాలా కాలంగా పెండింగులో ఉన్నదని తేలింది. ఐతే ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా న్యూ సీడ్ బిల్లును అమలు చేయాలని నిర్ణయించారు.

Next Story