పోస్టాఫీసులా ఉన్నత విద్యామండలి.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని ఉన్నత విద్యను క్రమబద్ధీకరించాల్సిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి కేవలం ఒక పోస్ట్ ఆఫీసులా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పోస్టాఫీసులా ఉన్నత విద్యామండలి.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఉన్నత విద్యను క్రమబద్ధీకరించాల్సిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి కేవలం ఒక పోస్ట్ ఆఫీసులా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో జరుగుతున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై వస్తున్న ఫిర్యాదుల పట్ల మండలి అవలంభిస్తున్న తీరుపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదు రాగానే యూనివర్సిటీలకు బదలాయింపు

సాధారణంగా ఏదైనా ప్రైవేట్ కళాశాల ఫీజుల దోపిడీకి పాల్పడినా, కనీస సౌకర్యాలు కల్పించకపోయినా బాధితులు ఉన్నత విద్యా మండలిని ఆశ్రయిస్తారు. అయితే, ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సింది పోయి మండలి అధికారులు ఆ వినతులను సంబంధిత యూనివర్సిటీలకు ఫార్వార్డ్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఉన్నత విద్యా మండలికి నేరుగా చర్యలు తీసుకునే అధికారాలు ఉన్నప్పటికీ ఫిర్యాదులను యూనివర్సిటీలకు ఫార్వర్డ్ చేసి తదుపరి కార్యాచరణ కోసం ఎదురు చూస్తున్నారనే తప్ప క్షేత్ర స్థాయిలో సమస్యలపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పలువురు విద్యార్థి సంఘాల నుండి అందిన ఫిర్యాదులపై మండలి కేవలం జేఎన్టీయూ వీసీకి ట్రాన్స్‌ఫర్ చేసి చేతులు దులుపుకుంది. కొన్నిసార్లు మండలి అధికారులను ఆయా అంశాలపై వివరణ అడగ్గా మాకు పరిమిత అధికారాలు ఉన్నాయని చెబుతుండటం గమనార్హం.

యూనివర్సిటీలు కాలయాపన

ఉన్నత విద్యా మండలి నుంచి లేఖ అందాక యూనివర్సిటీలు స్పందించడానికి నెలల సమయం పడుతోంది. ఈలోగా యాజమాన్యాలు తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఒక ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులను అదనపు బుక్స్ కోసం 5 వేలు కట్టాలని డిమాండ్ చేసింది. దీంతో విద్యార్థులు కాలేజీ బయట నిరసనలు చేశారు. అంతేకాకుండా ఉన్నత విద్యా మండలికి సైతం ఇదే విషయమై ఫిర్యాదు అందినా చర్యలు తీసుకోకపోవడం ఏంటని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి.

అధికారాల కొరత.. లేక బాధ్యతారాహిత్యమా?

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్న ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సుల పర్యవేక్షణలో మండలిది కీలక పాత్ర కావాలి. కానీ, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడం, అక్రమాలకు పాల్పడే కాలేజీలపై జరిమానాలు విధించడం వంటి విషయాల్లో మండలి వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజ్యాంగం ప్రకారం మండలికి ఉన్న అన్ని అధికారాలు ఉపయోగించి అక్రమ కాలేజీలపై ఉక్కుపాదం మోపకుండా ఎందుకు తలొగ్గుతున్నారనే ప్రశ్న వ్యక్తమవుతున్నది. విద్యాశాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం, ఉన్నత విద్యా మండలి అధికారుల మధ్య సమన్వయ లోపం అన్ని వెరసి సమస్యలకు మండలి కేరాఫ్‌గా మారుతోంది. అన్నిటికీ సెక్రెటరీ పైనే చైర్మన్, వైస్ చైర్మన్ లు అధాపడుతున్నారనే ఆరోపణలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత విద్యా మండలి అధికారులు తమ తీరు మార్చుకుని నిబంధలను ఉల్లంఘిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

Next Story